సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 19:50:12

సీఎం కేసీఆర్‌ కృషితోనే పీఎంజీఎస్‌వై నిధులు : మంత్రి ఎర్రబెల్లి

సీఎం కేసీఆర్‌ కృషితోనే పీఎంజీఎస్‌వై నిధులు : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషితోనే రాష్ట్రానికి పీఎంజీఎస్‌వై నిధులు వచ్చాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రధాని కలిసి, కేంద్రానికి పదే పదే లేఖలు రాశారని, తాను స్వయంగా రెండుసార్లు ఢిల్లీ వెళ్తేనే నిధులు మంజూరయ్యాయన్నారు. ఎవరైనా తమ వల్లే నిధులు వచ్చాయని భావిస్తే అది పొరపాటేనన్నారు. రోడ్డు సదుపాయం లేని ఆవాసాలు, గ్రామాలకు రోడ్లు వేసేందుకు వీలుగా కేంద్ర ప్రారంభించిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద ఇటీవల 1,119 కిలోమీటర్ల మేర రోడ్లు వేసేందుకు 152 పనులకు రూ.658.31 కోట్లు మంజూరు ఇచ్చిందన్నారు.

నిధుల విడుదల ఉత్తర్వులు రాగానే కొందరు తమ వల్లే విడుదలయ్యాయని చెప్పుకుంటున్నారని, దీంట్లో వాస్తవాలను ప్రజలకు తెలుపాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్త‌వానికి రాష్ట్రానికి 2,400 కి.మీ. మేర‌కు నిధులు రావాల్సి ఉందని, వాటి కోసం సీఎం కేసీఆర్‌ పీఎంను కలిసిన సందర్భాల్లోనే చెప్పడంతో పాటు పలు సార్లు లేఖలు రాశారన్నారు. తాను రెండు సార్లు ఢిల్లీకి వెళ్లి స్వయంగా సంబంధిత శాఖ మంత్రిని కలిశానని, ఇంత చేస్తే ఇప్పుడు అందులో సగం నిధులు కూడా దిక్కులేవన్నారు. ప‌రిస్థితి ఇలా ఉంటే కొంద‌రు కేవ‌లం త‌మ ప్ర‌య‌త్నాలతోనే ఏదో జ‌రిగిపోయింద‌ని ప్ర‌జ‌ల‌ను నమ్మించేందుకు చూస్తున్నారని ఆరోపించారు.

కేంద్రం తెలంగాణ పట్ల సానుకూలంగా లేదని, అయినా నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్రానికి రావాల్సిన వాటా విషయంలో కేంద్రంతో కొట్లాడి నిధులు తెస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రం కోసం నిరంతరం పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఉమ్మ‌డి రాష్ట్రం విభ‌జ‌న సంద‌ర్భంలో తెలంగాణ‌కు కేటాయించిన 900 కిలోమీటర్ల నిధుల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్రానికి మంత్రి డిమాండ్ చేశారు. అలాగే, రాష్ట్రానికి రావాల్సిన మిగ‌తా 1281 కిలోమీటర్ల మేర పీఎంజీఎస్‌వై నిధులు సాధ్యమైనంత త్వరలో విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు.


logo