ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 21, 2020 , 03:32:06

జనతా కర్ఫ్యూలో పాల్గొందాం

జనతా కర్ఫ్యూలో పాల్గొందాం

  • రాష్ట్రప్రజలకు సీఎం కేసీఆర్‌ పిలుపు
  • కరోనా నిర్ధారణ పరీక్షకు సీసీఎంబీని వినియోగించండి
  • వైరస్‌ కట్టడిలో కేంద్రానికి పూర్తిగా సహకరిస్తాం
  • వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్‌

మనకేం కాదులే అన్న భరోసా వద్దని ప్రధాని మోదీ సూచించారు.

మనకేమైతదిలే అన్న నిర్లక్ష్యం వద్దని సీఎం కేసీఆర్‌ హితవు చెప్పారు.

ఇష్టమొచ్చినట్టు తిరగొద్దు మొర్రో అని నిపుణులు మొత్తుకుంటున్నారు.  

..అయినా కొందరి చెవికెక్కడం లేదు. వారి బాధ్యతారాహిత్యం దేశానికే శాపమవుతున్నది. బాలీవుడ్‌ గాయని కనికాకపూర్‌ సంగతే చూడండి. లండన్‌ వెళ్లొచ్చిన ఆమె.. తనకేం లేదనుకుని లక్నోలో విందుకు హాజరైంది. ఇందులో మాజీ సీఎం వసుంధర రాజె, ఆమె కుమారుడు, ఎంపీ దుష్యంత్‌, పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. దావత్‌లో పాల్గొన్న దుష్యంత్‌.. పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యారు. పలువురు ఎంపీలతో కలిసి పార్లమెంటు స్థాయీసంఘం సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఫలితం.. దుష్యంత్‌తోపాటు ఇతర ఎంపీలు హోం క్వారంటైన్‌లోకి వెళ్లాల్సిన పరిస్థితి. కనికలాంటి నిర్లక్ష్యమే ఇటలీ, ఇరాన్‌ల కొంపముంచింది. ఇటలీలో మృతుల సంఖ్య చైనాను దాటిపోయింది. కరోనా కాటుకు ప్రపంచంలో బలైన వారి సంఖ్య 10 వేలు దాటింది. దావానలంలా అంటుకునే కరోనా వైరస్‌ను ఆపేందుకు మార్గం.. మనిషి మనిషితో అవసరమైనంత దూరాన్ని పాటించడమే! తస్మాత్‌ జాగ్రత్త!!


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొందామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా చేపడుతున్న ఈ కర్ఫ్యూను ఎవరికివారు విధిగా పాటిద్దామని సూచించారు. కార్యక్రమం విజయవంతానికి చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యాచరణపై కలెక్టర్లు, పోలీసు, వైద్యారోగ్యశాఖ తదితర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. 

అంతకుముందు 

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి చేపట్టాల్సిన చర్యలపై శుక్రవారం సాయంత్రం ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ కట్టడికి రాష్ట్రంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని.. ఈ మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టేందుకు కేంద్రానికి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. 

సమిష్టిగా కట్టడిచేసేందుకు సిద్ధం 

వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు హైదరాబాద్‌లోని ‘సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయోలజీ’ (సీసీఎంబీ)ని ప్రయోగశాలగా ఉపయోగించాలని ప్రధానికి సీఎం కేసీఆర్‌ సూచించారు. పెద్దసంఖ్యలో రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిచేందుకు ఇక్కడ అవకాశాలు ఉన్నాయని వివరించారు. కేంద్రం ఆధ్వర్యంలోని సీసీఎంబీలో జీవసంబంధ పరిశోధనలు జరుగుతున్నాయని.. కరోనా వైరస్‌ నిర్ధారణకు కూడా అవకాశం కల్పించాలని కోరారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని కేంద్రంతో కలిసి సమిష్టిగా కట్టడిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 

కేంద్రం తీసుకోవాల్సిన నిర్దిష్టమైన చర్యలపై సీఎం కేసీఆర్‌ పలు సూచనలు చేశారు. దేశంలో అతిపెద్ద నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌కు విదేశాల నుంచి ప్రయాణికులు భారీసంఖ్యలో వస్తుంటారని.. క్షుణ్ణంగా పరీక్షించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. జనసమ్మర్ధం అధికంగా ఉండే ఈ నగరాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి, చర్యలు తీసుకోవాలని కోరారు. విదేశాలనుంచి వచ్చినవారి ద్వారానే వైరస్‌ ప్రబలుతున్నదని పేర్కొంటూ..అంతర్జాతీయ విమానాల రాకపోకలను కొన్నిరోజులపాటు పూర్తిగా నిలిపివేయాలని సూచించారు. ప్రజలు రైళ్ల ద్వారా ప్రయాణాలు చేస్తుంటారని..అన్ని రైల్వేస్టేషన్ల వద్ద పరీక్షలు నిర్వహించాలని కోరారు. రైల్వేస్టేషన్లు, బోగీల్లో హైశానిటేషన్‌ నిర్వహించాలని కోరారు. తెలంగాణలో ప్రజలు గుమికూడకుండా అన్నిచర్యలు తీసుకున్నామని.. శ్రీరామనవమి, జగ్నేకీరాత్‌ తదితర పండుగల సందర్భంగా ఉత్సవాలు రద్దుచేసినట్టు సీఎం కేసీఆర్‌ వివరించారు.


logo