సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 12, 2020 , 02:26:14

పటిష్ఠంగా వైద్యరంగం

పటిష్ఠంగా వైద్యరంగం

  • భవిష్యత్తులోనూ కరోనావంటి పరిస్థితులు
  • తట్టుకునేలా వైద్యసదుపాయాలు పెంచాలి
  • అందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలి
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి
  • ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచన

‘రాష్ట్రంలో రికవరీ రేటు 71% ఉన్నది. మరణాల రేటు 0.7% ఉన్నది. పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాం. కరోనా సోకినవారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. కావాల్సినన్ని బెడ్లు, మందులు, ఇతర పరికరాలు, సామగ్రి సిద్ధంగా ఉంచాం. ఐసీఎమ్మార్‌, నీతిఆయోగ్‌, కేంద్ర బృందాల సలహాలు పాటిస్తున్నాం. వైద్య సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది, ఇతర ప్రభుత్వ యంత్రాంగం అంతా శక్తివంచన లేకుండా పనిచేస్తున్నది’ 

- ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని, దేశంలో వైద్య సదుపాయాలను పెంచే విషయంపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్రానికి సూచించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం పది రాష్ర్టాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కొవిడ్‌ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో కరోనా పరిస్థితిని వివరించారు. దేశంలో వైద్య సదుపాయాలను పెంచాల్సిన అవసరాన్ని కరోనా గుర్తుచేసిందని చెప్పారు. ‘కరోనా అనుభవాలు మనకు పాఠం నేర్పాయి. దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉన్నది. వైద్యరంగంలో భవిష్యత్‌ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో దూరదృష్టితో ఆలోచించాలి. సమగ్ర వైద్య సదుపాయాల కోసం ప్రణాళిక వేయాలి. కేంద్రం, రాష్ర్టాలు కలిసి ఈ ప్రణాళిక అమలుచేయాలి. 

గతంలో మనకు కరోనా వంటి అనుభవం లేదు. ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. దీన్ని ఎదుర్కొంటూనే భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు వస్తే ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించే విషయంపై దృష్టిపెట్టాలి. గతంలో కూడా అనేక వైరస్‌లు ప్రజలను ఇబ్బందిపెట్టాయి. కరోనా వైరస్‌లాంటివి భవిష్యత్‌లో కూడా వచ్చే అవకాశం ఉన్నది. వైద్యరంగంలో ఏ విపత్కర పరిస్థితి తలెత్తినా సరే తట్టుకునేలా మనం ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలి. జనాభా నిష్పత్తి ప్రకారం ఎంతమంది డాక్టర్లు ఉండాలి? ఇంకా ఎన్ని మెడికల్‌ కాలేజీలు రావాలి? లాంటి విషయాలను ఆలోచించాలి. ఐఎంఏ లాంటి సంస్థలతో సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలి. ఇది తప్పక ఆలోచించాల్సిన విషయం. ఇది దేశానికి మంచి చేసే చర్య. కరోనా లాంటివి భవిష్యత్‌లో ఏమి వచ్చినా సరే తట్టుకొని నిలబడేలా వైద్యరంగం తయారుకావాలి. దీనికోసం ప్రధానమంత్రి చొరవ తీసుకోవాలి. కేంద్రం, రాష్ట్రం కలిసికట్టుగా పనిచేసి, దేశంలో వైద్య సదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉన్నది’ అని సీఎం కేసీఆర్‌ ప్రధాని మోదీకి సూచించారు.


రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు పటిష్ఠ చర్యలు

తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్‌.. ప్రధాని మోదీకి తెలిపారు. ‘రాష్ట్రంలో రికవరీ రేటు 71% ఉన్నది. మరణాల రేటు 0.7% ఉన్నది. పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాం. కరోనా సోకినవారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. కావాల్సినన్ని బెడ్లు, మందులు, ఇతర పరికరాలు, సామగ్రి సిద్ధంగా ఉంచాం. ఐసీఎమ్మార్‌, నీతిఆయోగ్‌, కేంద్ర బృందాల సలహాలు పాటిస్తున్నాం. వైద్య సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది, ఇతర ప్రభుత్వ యంత్రాంగం అంతా శక్తివంచన లేకుండా పనిచేస్తున్నది’ అని సీఎం కేసీఆర్‌ వివరించారు. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, బీహార్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రులు మాట్లాడారు. కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌తోపాటు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వి, వైద్యశాఖ విభాగాధిపతులు శ్రీనివాసరావు, రమేశ్‌రెడ్డి, గంగాధర్‌, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo