శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 02:36:31

సమూహ వ్యాప్తిడేంజర్‌

సమూహ వ్యాప్తిడేంజర్‌

  • కరోనాతో కలిసి బతకాల్సిందే
  • ప్రజలను అప్రమత్తం చేయాలి
  • ఆర్థికవ్యవస్థనూ కాపాడుకోవాలి
  • ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్‌
  • రాష్ట్రంలో వర్షాలు, పంటలపై 
  • ఇద్దరి మధ్య ఫోన్‌ సంభాషణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనాతో ఇక కలిసి బతకడం తప్పదని, దేశంలో ప్రజలను ఒక పక్క కాపాడుకొంటూనే మరోపక్క ఆర్థికరంగాన్ని కూడా నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో అన్నారు. ఆదివారం ప్రధాని మోదీ.. వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌తోనూ సంభాషించారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న వివిధ అంశాలపై వీరిరువురి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది. దేశంలో కరోనా.. సామూహిక వ్యాప్తి దశకు చేరుకున్నదని ప్రధాని.. సీఎం కేసీఆర్‌తో చెప్పారు. దేశంలో కరోనాను నివారించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అన్ని రాష్ట్రాలూ తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రధానమంత్రి ఈ సందర్భంగా అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలను తీసుకున్నదని, ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ ఉద్ధృతి తగ్గకపోగా కమ్యూనిటీ స్ప్రెడ్‌ స్థాయికి చేరడం ఆందోళనకరమేనన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాతో సహజీవనం తప్పదని, మరింత జాగరూకతతో ప్రజలు తమ జీవనం కొనసాగించాల్సిన అవసరన్నదని, తమ ప్రభుత్వం ప్రజలను ఈ మేరకు అప్రమత్తం చేస్తున్నదని చెప్పారు. ఒక పక్క వైరస్‌తో పోరాడుతూనే ఆర్థికరంగాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని, ఈ క్రమంలో ఆర్థిక కార్యకలాపాలను నిరంతరంగా కొనసాగించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇప్పటికే ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. మరింత జాగ్రత్తగా ఆర్థిక రంగాన్ని మళ్లీ గాడినపెట్టాల్సిన అవసరమున్నదని ప్రధానితో సీఎం కేసీఆర్‌ చెప్పారు. 

వర్షాలు ఎలా ఉన్నాయి?

రాష్ట్రంలో వర్షాలు ఎలా ఉన్నాయని, రుతుపవనాల ప్రభావం ఎలా ఉన్నదంటూ కూడా ప్రధాన మంత్రి ఆరా తీశారు. తెలంగాణలో మంచి వానలు పడుతున్నాయని, ఈసారి మంచిగా కాలం అవుతుందని, రైతులు ఈ సీజన్‌లో పంటలు వేయడం మొదలుపెట్టారని, నీటి లభ్యత పెరిగిందని వివరించారు.  తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తిచేసిందని, దీనివల్ల కొత్త ఆయకట్టు కూడా ఏర్పడిందని, ఈసారి రికార్డు స్థాయిలో పంటలు వచ్చే అవకాశం ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినట్టు తెలిసింది. 


logo