గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Aug 10, 2020 , 01:30:59

వ్యవసాయానికి లక్ష కోట్లు

వ్యవసాయానికి లక్ష కోట్లు

 • లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి 
 • సేద్యానికి నిధి
 • ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ 
 • వ్యవసాయోత్పత్తుల నిల్వ, ప్రాసెసింగ్‌ 
 • భారీగా గోదాముల నిర్మాణం
 • వ్యవసాయ రైతు సంఘాలకు రుణాలు 

దేశంలో వ్యవసాయోత్పత్తుల నిల్వ, ప్రాసెసింగ్‌కు మెరుగైన వసతులు కల్పించేందుకు రూ.లక్ష కోట్లతో కేంద్రప్రభుత్వం వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రారంభించింది. గ్రామాల్లో వ్యవసాయోత్పత్తులకు గోదాములు, కోల్డ్‌ స్టోరేజీలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు తదితర మౌలికసదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన ఈ నిధిని ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ నిధి నుంచి రైతు సంఘాలు, వ్యవసాయ ప్రాథమిక రుణ సమాఖ్యలు, పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇవ్వనున్నారు. ఈ ఏడాది రూ.10వేల కోట్లు, వచ్చే మూడేండ్లు ఏటా 30వేల కోట్ల చొప్పున రుణాలు ఇస్తారు.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: పాడిపంటలకు నెలవైన భారతదేశంలో వ్యవసాయోత్పత్తుల వృథాను అరికట్టేందుకు కేంద్రం కీలక కార్యాచరణ చేపట్టింది. పంట కోతల తర్వాత ఉత్పత్తులకు మెరుగైన నిల్వ, ప్రాసెసింగ్‌ సౌకర్యాలు కల్పించేందుకు రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌)ను ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ పథకం కింద కోల్డ్‌ స్టోరేజీలు, గోదాములు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, వేర్‌హౌస్‌లు నిర్మించేందుకు రుణాలు మంజూరు చేస్తారు. బలరాముడి జయంతి సందర్భంగా ప్రారంభించిన ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రధానితోపాటు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌, పలు రాష్ర్టాల రైతులు పాల్గొన్నారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర రైతులతో ప్రధాని నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

ఉద్యోగాలూ వస్తాయి: మోదీ

వ్యవసాయ ఉత్పత్తులకు మౌలిక సదపాయాల కల్పనద్వారా భారీ ఎత్తున ఉద్యోగాలు కూడా అందుబాటులోకి వస్తాయని మోదీ అన్నారు. దేశంలో వ్యవసాయోత్పత్తుల ప్రాసెసింగ్‌ రంగంలో అపార వ్యాపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మరోవైపు, దేశానికి అండమాన్‌ నికోబార్‌ దీవులు వ్యూహాత్మకంగా అత్యంత కీలక ప్రాంతాలని బీజేపీ నేతలతో జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ తెలిపారు. ఈ దీవులకు చెన్నై నుంచి సబ్‌మెరైన్‌ ఆప్టికల్‌ కేబుల్‌ను సోమవారం ప్రధాని ప్రారంభించనున్నారు. 


వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ముఖ్యాంశాలు

 • వ్యవసాయోత్పత్తులు వృథా కాకుండా చూడటం ప్రధాన లక్ష్యం.
 • ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10వేల కోట్లు రుణాలు ఇస్తారు.
 • తర్వాత మూడేండ్లపాటు ఏటా రూ.30వేల కోట్లు ఇస్తారు. 
 • ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు (పీఏసీఎస్‌), వ్యవసాయ సంఘాలు, రైతు ఉత్పాదక సమాఖ్యలు (ఈపీవోస్‌), వ్యవసాయ సంబంధ కంపెనీలు, అంకుర సంస్థలు, వ్యవసాయ సాంకేతిక సంస్థలకు ఈ నిధి నుంచి రుణాలు ఇస్తారు. 
 • రుణాల మంజూరుకోసం 11 ప్రభుత్వరంగ బ్యాంకులతో ఒప్పందాలు.
 • రుణాలు తీసుకున్న సంస్థలకు 3% వడ్డీ రాయితీ  ఉంటుంది. 
 • వ్యవసాయ సంబంధ పరిశ్రమలు స్థాపించేవారికి రూ.2 కోట్లవరకు రుణహామీ.  
 • గ్రామాల్లో కూడా పంటల నిల్వ కోసం గోదాములు, పంటల ప్రాసెసింగ్‌ యూనిట్లు నిర్మిస్తారు.

ఒక్క క్లిక్‌తో 17000 కోట్లు

దేశంలోని 8.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ ఆదివారం రూ.17 వేల కోట్లు జమచేశారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం కిసాన్‌) పథకంలో భాగంగా డిజిటల్‌ విధానంలో ఒక్క క్లిక్‌తో నేరుగా ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో వేశారు. 2018 డిసెంబర్‌లో ప్రారంభించిన ఈ పథకంలో తాజాగా జమచేసిన మొత్తం ఆరోవిడత. రైతులకు పంట పెట్టుబడిగా ఏటా రూ.6000 నగదు అందించేందుకు ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ మొత్తాన్ని రూ.2000 చొప్పున మూడు వాయిదాల్లో  జమచేస్తారు.