శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 01:06:53

కరెంట్‌తో పెట్టుకుంటే పవర్‌ ఉండదు

కరెంట్‌తో పెట్టుకుంటే పవర్‌ ఉండదు

పీయూసీ చైర్మన్‌ జీవన్‌రెడ్డి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పవర్‌తో పెట్టుకున్నోళ్లందరూ పవర్‌ లేకుండాపోయారు.. ప్రధాని మోదీ కూడా అదేవిధంగా అవుతారని పీయూసీ చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. కేంద్రం రాష్ట్రాల హక్కులను హరించేలా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఫెడరల్‌ స్ఫూర్తిగా విరుద్ధంగా  మోదీ నిర్ణయాలు ఉంటున్నాయని విమర్శించారు. గురువారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు కరెంట్‌తో పెట్టుకుని పవర్‌ కోల్పో తే.. అదే పవర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని అధికారంలోకి తీసుకువచ్చిందని చెప్పారు. చంద్రబాబుకు పట్టినగతే కేంద్రంలో మోదీకి కూడా పడుతుందని విమర్శించారు. రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్‌ను తొలిగించేందుకే కేంద్ర్రం విద్యుత్‌ సవరణ బిల్లును తీసుకొస్తున్నదని తెలిపారు. ఈ బిల్లును సీఎం కేసీఆర్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, రైతు లు ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీజే పీ.. బోగస్‌ జనతా పార్టీ అని అభివర్ణించారు. నిజామా బాద్‌ ఎంపీ అర్వింద్‌.. ఫేక్‌ ఎంపీ అని ఎద్దేవాచేశారు.


logo