ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 01:27:48

ప్లగ్‌ అండ్‌ ప్లే తెలంగాణ

ప్లగ్‌ అండ్‌ ప్లే తెలంగాణ

  • రెడీగా రాష్ట్రంలోని పారిశ్రామికపార్కులు
  • చైనా నుంచి తరలించే పరిశ్రమలకు రెడ్‌ కార్పెట్‌
  • పెట్టుబడుల ఆకర్షణకు రాష్ట్ర సర్కారు కార్యాచరణ
  • సమగ్ర వివరాలతో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక

అనుకూల వాతావరణం.. పెట్టుబడులకు మౌలిక వసతులు భేష్‌.. టీఎస్‌ఐపాస్‌ సూపర్‌.. ఇలా పరిశ్రమలకు స్వర్గధామంగా మారింది తెలంగాణ రాష్ట్రం. అనతి కాలంలోనే అంతర్జాతీయ కంపెనీలను అమ్ములపొదిలో చేర్చుకున్నది. ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ అంటూ ఇప్పుడు చైనా నుంచి తరలించే కంపెనీలపై రాష్ట్ర సర్కారు ఫోకస్‌ పెట్టింది. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా సంక్షోభంలోనూ రాష్ర్టాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ప్రస్తుతం చైనా నుంచి తరలించే కంపెనీలను తెలంగాణకు ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు ఆయా పరిశ్రమల వివరాలను సేకరించాలని, పెట్టుబడులను ఆకర్షించేలా రాయితీలు ప్రకటిస్తున్న దేశాల జాబితాను కూడా రెడీచేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఆయారంగాలకు చెందిన ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు, రాయితీలు, ప్రోత్సాహకాలు, మానవ వనరులు, భౌగోళిక, వాతావరణ పరిస్థితులు, ఈవోడీబీ, టీఎస్‌ఐపాస్‌ లాంటి అనుకూల అంశాలను వివరిస్తున్నారు. దీంతోపాటు రాష్ట్రం ఏయే రంగాల పెట్టుబడులకు అనుకూలమైనదో తెలిపే సమగ్ర వివరాలను తయారుచేశారు. కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టగానే అతి తక్కువ సమయంలో వాణిజ్య ఉత్పత్తులు ప్రారంభించేలా ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో మౌలిక సదుపాయలను చెప్తూ పారిశ్రామిక పార్కుల వివరాలను సిద్ధంచేశారు.

ఈ రంగాలపై దృష్టి

రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్‌, టెక్స్‌టైల్‌, వైద్యం, ఐటీ, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌, ఏరోస్పేస్‌ వంటి రంగాలకు చెందిన పరిశ్రమలకు అనువైన వాతావరణం, మానవ వనరులు, మౌలిక సదుపాయలు ఉన్నాయి. వీటిపై సమగ్ర వివరాలను రాష్ట్ర ప్రభుత్వం తయారుచేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు కేంద్రం కూడా తోడ్పాటు అందించాల్సి ఉన్నది. విదేశీ పెట్టుబడులకు కేంద్ర అనుమతులు కూడా ముఖ్యం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కల్పిస్తున్న మౌలిక వసతులు, అనుకూల అంశాలతో కూడిన నివేదికను అధికారులు కేంద్రానికి పంపించారు.

ప్లగ్‌ అండ్‌ ప్లే

పగ్ల్‌ అండ్‌ ప్లే విధానంలో పరిశ్రమలను స్థాపించుకొని వెంటనే వాణిజ్య ఉత్పత్తులు ప్రారంభించే అవకాశమున్న 21 పారిశ్రామిక పార్కులను పరిశ్రమల శాఖ అధికారులు గుర్తించారు. ఇందులో అత్యధిక పార్కుల్లో కొన్ని కంపెనీలు తమ వాణిజ్య ఉత్పత్తులు ప్రారంభించగా, మరికొన్ని కంపెనీల ఏర్పాటుకు అవసరమైన స్థలం అందుబాటులో ఉన్నది. ఆ వివరాలను కూడా కేంద్రానికి నివేదించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా క్లస్టర్‌ను కొన్ని నెలల్లో ప్రారంభించడానికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే రోడ్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయల పనులు చురుకుగా సాగుతున్నాయి. దీనికోసం పదివేల ఎకరాలు సేకరించగా మరో రెండువేల ఎకరాల సేకరణ తుదిదశకు చేరింది. మరో ఎలక్ట్రానిక్‌ మ్యానుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ను మంజూరుచేయాలని తెలంగాణ కేంద్రాన్ని ఇప్పటికే కోరింది. రాష్ట్రం తీసుకొచ్చిన టీఎస్‌ఐపాస్‌ చట్టం వల్ల.. రాష్ర్టానికి 12వేలకు పైగా పరిశ్రమలకు రాష్ర్టానికి వచ్చాయి. దీంతోపాటు ఈవోడీబీలో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. ఈవోడీబీతోపాటు కాస్ట్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, క్వాలిటీ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ మీద దృష్టి పెట్టింది.logo