ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 05, 2020 , 03:16:07

నెగెటివ్‌ వస్తేనే అసెంబ్లీ ఎంట్రీ

నెగెటివ్‌ వస్తేనే అసెంబ్లీ ఎంట్రీ

  • వైరస్‌ లక్షణాలు కనిపించినా రావొద్దు 
  • సభకు ప్రజాప్రతినిధులు సహకరించాలి.. సందర్శకులకు అనుమతి లేదు
  • స్పీకర్‌ పోచారం, మండలి చైర్మన్‌ గుత్తా, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచన
  • అసెంబ్లీ , మండలి సమావేశాల నిర్వహణపై అధికారులతో సమీక్ష

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని నెగెటివ్‌ వచ్చినవారినే అసెంబ్లీలోకి అనుమతిస్తామని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. కరోనా పాజిటివ్‌ వచ్చినా, లక్షణాలు కనిపించినా సభకు రావొద్దని సూచించారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వారి నియోజకవర్గాల్లోనే కరోనా పరీక్షలు చేయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేసిందని చెప్పారు. ఈ నెల 7 నుంచి ప్రారంభంకానున్న శాసనసభ, శాసనమండలి సమావేశ ఏర్పాట్లపై మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అంతకుముందు అసెంబ్లీ సమావేశ మందిరాన్ని పరిశీలించారు. 

తెలంగాణలో కరోనా మరణాలు తక్కువ

రాష్ట్రంలో కరోనా బారినపడ్డవారు, మరణించిన వారిసంఖ్య ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తక్కువగా ఉన్నదని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సమావేశాలకు సందర్శకులను అనుమతించబోమని ప్రకటించారు. లాబీల్లోకి ఎవరినీ అనుమతించబోమని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. పార్లమెంట్‌ మార్గదర్శకాలను పాటిస్తూ అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నామని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. మీడియా సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌లు దాస్యం వినయ్‌భాస్కర్‌, బీ వెంకటేశ్వర్లు, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వీ నర్సింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. కాగా, వర్షాకాల సమావేశాల నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి అసెంబ్లీలో కరోనా నిర్ధారణ పరీక్షలను ప్రారంభించారు. స్పీకర్‌ పోచారం, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, మాజీ మంత్రి జోగురామన్న కూడా పరీక్షలు చేసుకున్నారు. వారికి నెగెటివ్‌ వచ్చింది. టెస్టులు శనివారం కూడా కొనసాగనున్నాయి. 


‘అసెంబ్లీ’కి సమాచారం సిద్ధం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సర్కారు సిద్ధమవుతున్నది. అధికార, ప్రతిపక్ష సభ్యులు అడిగే సమాచారాన్ని ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు అన్ని శాఖల అధికారులు తమ తమ శాఖాపరమైన అంశాలపై క్షేత్ర స్థాయి నుంచి సమాచారం తెప్పించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు.  సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు పూర్తిస్థాయిలో జరగాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. కరోనా మొదలు వ్యవసాయరంగం వరకు దాదాపు పదికి పైగా అంశాలను చర్చించాలని బీఏసీ సమావేశంలో ప్రభుత్వం ప్రతిపాదించనున్నది. ప్రతి అంశానికి సంబంధించిన వివరాలను గణాంకాలతో ప్రభుత్వం అసెంబ్లీలో వివరించే ప్రయత్నం చేయనున్నది. ఆదివారం సాయంత్రం వరకు అన్ని జిల్లాల నుంచి పూర్తిస్థాయి సమాచారం ఆయాశాఖల కార్యదర్శులకు వచ్చే అవకాశమున్నది. 


logo