సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 13:38:37

ప్లాస్మా ఇవ్వడమంటే ప్రాణదానం చేయడమే : సీపీ సజ్జనార్‌

ప్లాస్మా ఇవ్వడమంటే ప్రాణదానం చేయడమే : సీపీ సజ్జనార్‌

హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీసులు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా వైరస్‌ను జయించిన వారి నుంచి ప్లాస్మాను సేకరించి.. కరోనా రోగులకు అందజేసి వారి ప్రాణాలను కాపాడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ప్లాస్మా దాతలను తీసుకెళ్లేందుకు సైబరాబాద్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లను సీపీ సజ్జనార్‌ శుక్రవారం ప్రారంభించారు. షీ బృందం ఆధ్వర్యంలో గృహ హింస బాధితుల కోసం ప్రత్యేకంగా మూడు గస్తీ వాహనాలను కూడా ప్రారంభించారు. 

గత రెండు, మూడు రోజుల్లోనే 27 మంది ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వచ్చారు అని సీపీ తెలిపారు. వాళ్ల నుంచి 54 మందికి ప్లాస్మా ఇచ్చామని చెప్పారు. ప్లాస్మా ఇవ్వడమంటే ప్రాణదానం చేయడమే అని స్పష్టం చేశారు. ప్లాస్మా ఇచ్చే వాళ్లను సమన్వయం చేయడానికి ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ప్లాస్మా దానం చేసేందుకు కరోనా నుంచి కోలుకున్న వారు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్మా ఇచ్చేందుకు ఆసక్తి గలవారు 94906 17440ను సంప్రదించొచ్చు అని సీపీ సజ్జనార్‌ సూచించారు. ఇందుకోసం donateplasma.scsc.in వెబ్‌సైట్‌ను కూడా సైబరాబాద్‌ పోలీసులు అందుబాటులోకి తెచ్చారు.  

కమిషనరేట్‌ పరిధిలో మహిళల భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని సీపీ స్పష్టం చేశారు. డయల్‌ 100కు వచ్చే కాల్స్‌లో 40 శాతం మహిళలవే అన తెలిపారు. బాధిత మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఈ వాహనాల్లో నలుగురు సిబ్బంది ఉంటారు. సమాచారం అందుకున్న క్షణాల్లోనే బాధిత మహిళలను ఈ సిబ్బంది రక్షిస్తారని సీపీ పేర్కొన్నారు.


logo