ఆదివారం 07 జూన్ 2020
Telangana - Feb 01, 2020 , 02:12:00

న్యాక్‌ను మరింత విస్తరించాలి

న్యాక్‌ను మరింత విస్తరించాలి
  • ఉపాధి కల్పనలో ముఖ్య భూమిక పోషించాలి
  • నియోజకవర్గానికో శిక్షణ కేంద్రం ఏర్పాటు
  • న్యాక్‌ ఈసీ సమావేశంలో మంత్రి వేముల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/మాదాపూర్‌ : నైపుణ్య శిక్షణలో ఉపాధి కల్పిస్తున్న నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌)ను మరింత విస్తరించేలా రోడ్‌ మ్యాప్‌ తయారుచేయాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో న్యాక్‌ ముఖ్యభూమిక పోషించాలని చెప్పారు. 


శుక్రవారం హైదరాబాద్‌ మాదాపూర్‌లోని న్యాక్‌లో ఏర్పాటుచేసిన 40వ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (ఈసీ) సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, రోడ్లు భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఐజీబీసీ చైర్మన్‌ శేఖర్‌రెడ్డి, బీఏఐ సభ్యులు ఎన్‌ఎస్‌ఎన్‌ రెడ్డి, బీఎన్‌ రెడ్డి, న్యాక్‌ డైరెక్టర్‌ జనరల్‌ కే భిక్షపతి, డైరెక్టర్‌ శాంతి శ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఆదేశిస్తే ప్రతి నియోజకవర్గానికి ఒక నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పడానికి సిద్ధమవ్వాలని తెలిపారు. 


నిరుద్యోగ యువతకు, నిర్మాణ రంగ కార్మికులకు ఉత్తమ శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించేలా కృషి చేయడానికి కావాల్సిన ప్రణాళికలు తయారు చేయాలని డీజీ భిక్షపతిని ఆదేశించారు. ప్రతి జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలు, స్థలాలను గుర్తించి నివేదిక సిద్ధంచేయాలని సీఎస్‌కు సూచించారు. న్యాక్‌ను మరింత విస్తరించేలా రోడ్‌ మ్యాప్‌ తయారు చేయాలని డీజీ తెలిపారు. న్యాక్‌ కేవలం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ లాంటి ఉపాధి కల్పన కోర్సులకే పరిమితం కాకుండా ప్రస్తుత నిర్మాణ రంగ అభివృద్ధికి అనుగుణంగా కొత్త కోర్సులను, నిర్మాణ రంగం భద్రత, వర్కింగ్‌ ఇంజినీర్లతో కేపాసిటీ బిల్డింగ్‌ కోర్సులు రూపొందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా 20 మంది న్యాక్‌ ఉద్యోగులకు మంత్రి ఉత్తమ పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా న్యాక్‌ 2020 డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.


logo