సోమవారం 01 జూన్ 2020
Telangana - May 11, 2020 , 01:29:49

నేటినుంచి ప్లాస్మాథెరపీ

నేటినుంచి ప్లాస్మాథెరపీ

గాంధీ దవాఖానలో ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా బాధితులకు సోమవారం నుంచి ప్లాస్మా థెరపీ చికిత్స అందించేందుకు గాంధీ దవాఖానలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. గాంధీ, ఈఎస్‌ఐసీ దవాఖానల్లో ప్లాస్మా థెరపీ చికిత్సకు ఐసీఎమ్మార్‌ ఇటీవలే అనుమతించిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి ఇక్కడికి వచ్చినవారిలో కరోనా పాజిటివ్‌తో కోలుకొన్న 15 మంది చికిత్సకు అవసరమైన ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. గాంధీ దవాఖానలో కరోనా నుంచి కోలుకొన్నవారిలో 200 మంది కూడా ప్లాస్మా ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. సోమవారం విదేశాల నుంచి వచ్చిన 15 మంది ప్లాస్మాను సేకరించనున్నారు. ఐసీఎమ్మార్‌ మార్గదర్శకాల ప్రకారం ప్లాస్మా థెరపీకి అర్హులైన కరోనా బాధితులు గాంధీలో ప్రస్తుత ఐదుగురు ఉన్నారు.

ప్లాస్మా చికిత్స ఇలా..

ప్లాస్మా థెరపీకి ఎంపికచేసిన బాధితుడికి ఇదివరకు వైరస్‌ నుంచి కోలుకొన్నవారిలో ఆరోగ్యవంతుల ప్లాస్మాను సేకరించి చికిత్స అందిస్తారు. శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్‌లను చంపే యాంటీ బాడీ (ప్రతిరక్షకం)లు ఇందులో ఉంటాయి. కరోనా నుంచి కోలుకొన్నవారి ప్లాస్మాలో వైరస్‌ను చంపే యాంటీ బాడీలు ఉంటాయి. శరీరంలో ఉన్న వైరస్‌ కణాలను తెల్లరక్తకణాలు గుర్తించి నాశనంచేస్తాయి. ఒక దాత నుంచి సేకరించిన ప్లాస్మాతో నలుగురికి చికిత్స అందించవచ్చు.logo