శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Aug 01, 2020 , 03:32:25

ప్లాస్మాతో ప్రాణం పోద్దాం

ప్లాస్మాతో ప్రాణం పోద్దాం

  • కరోనా రోగులకు ప్రాణాధారమవుతున్న చికిత్స
  • కొవిడ్‌ విజేతలు నిర్భయంగా దానం చేయవచ్చు
  • ఆదర్శంగా నిలుస్తున్న పలువురు విజేతలు
  • తరలిరావాలంటున్న వైద్యులు, నిపుణులు
  • ప్లాస్మా దానంలో ముందుంటున్న పోలీసులు

ధైర్యంగా వెళ్లి ప్లాస్మా ఇవ్వొచ్చు..ప్లాస్మా దానం చేయడం అంటే అంతా ఎంతో కంగారు పడుతున్నారు. కానీ ధైర్యంగా వెళ్లి ప్లాస్మాదానం చేయవచ్చు. నేను కూడా ఒక డాక్టర్‌కు ఇచ్చాను. మన శరీరంలోంచి రక్తాన్ని ఒక మిషన్‌లోకి పంపి ప్లాస్మాను వేరుచేస్తారు. తిరిగి ఎర్రరక్తకణాలు మళ్లీ మనశరీరంలోకే పంపుతారు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకరికి సాయం చేశామన్న తృప్తి మనకు ఉంటుంది.

- విజయ్‌, కానిస్టేబుల్‌, చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా రోగులకు అందిస్తున్న చికిత్స విధానాల్లో ప్లాస్మా థెరపీ ఒకటి. దీనికోసం ఇప్పటికే దేశంలోని పలు రాష్ర్టాల్లో ప్లాస్మా బ్యాంకులు ప్రారంభమయ్యాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ దవాఖానలో కూడా ప్రారంభించారు. అయితే రాష్ట్రంలో కరోనా రికవరీ కేసులు పెరుగుతున్నప్పటికీ ప్లాస్మా దానం చేసేందుకు వస్తున్న వారు  మాత్రం పదుల సంఖ్యలోనే ఉండటం విస్మయం గొలుపుతున్నది. ప్లాస్మా ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని, ప్రాణాలు నిలబెట్టవచ్చని ఒకవైపు వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రచారం చేస్తుంటే, మరోవైపు పోలీసులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్లాస్మా దానం చేసేందుకు వస్తున్నవారిలో వైద్య సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు ముందు వరుసలో ఉంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సైబరాబాద్‌ పోలీసులు 10 రోజుల్లో 160 మందికి ప్లాస్మాను దానం చేశారని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. 

14 రోజులకు ఒకసారి దానం చేయొచ్చు

కొవిడ్‌ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకొన్న తరువాత 14 రోజుల వరకు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకపోతే ఆ వ్యక్తి ప్లాస్మా దానం చేయవచ్చు. అయితే ఎక్కువ శాతం 28 రోజులు దాటిన వారినుంచే ప్లాస్మా సేకరిస్తున్నారు. ప్లాస్మా దానంచేసేందుకు 18-60 ఏండ్లలోపువారు, 50 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్న వారు అర్హులు. డయాబెటిస్‌, క్యాన్సర్‌, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు, గర్భిణులు ప్లాస్మా దానానికి అనర్హులని ఐసీఎంఆర్‌ సూచించింది. రక్త పోటు 140 కన్నా ఎక్కువ ఉన్న వారు డయాస్టోలిక్‌ పీడనం 60 కన్నా తక్కువ -90 కంటే ఎక్కువ ఉన్న వారు కూడా అనర్హులని పేర్కొంది. అర్హులైన దాతలు ప్రతి రెండు వారాలకు 500 మిల్లీలీటర్ల ప్లాస్మాను దానం చేయవచ్చు. ఇలా సేకరించిన ప్లాస్మాను అతి శీతల వాతావరణంలో కనీసం సంవత్సరం దాకా భద్రపరచవచ్చు. 

45నిమిషాల్లో ప్రక్రియ పూర్తి

రక్తంలోని ప్లాస్మాను మాత్రమే తీసుకొని రక్త కణాలను తిరిగి శరీరంలోకి ఎక్కిస్తారు. సాధారణంగా రక్తం తీసేందుకు 10 నిమిషాల సమయం పడితే ప్లాస్మా తీసేందుకు 45 నిమిషాలవుతుంది. తీసిన ప్లాస్మాను 24 గంటల్లో గడ్డ కట్టేలా చేస్తారు. అవసరం అనుకున్నపుడు దాన్ని కరిగించి వినియోగిస్తారు. ప్లాస్మా ఇచ్చిన వ్యక్తికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. కొవిడ్‌ పాజిటివ్‌ ఉండి నయం అయిన వారు సంతోషంగా ప్లాస్మా దానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడాలని వైద్యులు పిలుపునిస్తున్నారు. 

ప్లాస్మా దాతలపై ప్రశంసల జల్లులు

కరోనా సోకి అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న వారి ప్రాణం కాపాడేందుకు ముందుకొచ్చిన ప్రాణదాతలపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. శుక్రవారం ఓ వైద్యుడిని కాపాడుకునేందుకు ముందుకు వచ్చి, ప్లాస్మా దానం చేసిన టీ న్యూస్‌ రిపోర్టర్‌ లివిల్‌రెడ్డిని మంత్రి హరీశ్‌ రావు, మాజీ ఎంపీ కవిత ట్విట్టర్‌ వేదికగా అభినందించారు. కరోనా సోకి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

ఎంతో గర్వంగా ఉంది

నేను ఒక వైద్యుడి ప్రాణాన్ని కాపాడేందుకు ముందుకు వచ్చా ను. ప్లాస్మా దానం చేయడం గర్వంగా ఉంది. ఒకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం రావటం నా అదృష్టం. నేను వీలైనన్ని సార్లు ప్లాస్మా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. రికవరీ అయిన ప్రతి ఒక్కరు ప్లాస్మా దానానికి ముందుకొస్తే చివరి దశలో ఉన్న ఎంతోమందిని కాపాడుకోవచ్చు. ఎలాంటి భయం వద్దు. ప్లాస్మా దానం చేసి బాధ్యతను నిర్వర్తించండి. 

- లివిల్‌రెడ్డి, జర్నలిస్ట్‌, టీ న్యూస్‌

తాజావార్తలు


logo