శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 22, 2020 , 02:50:44

ప్లాస్మా.. జీవౌషధం!

ప్లాస్మా.. జీవౌషధం!

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : కరోనా మహమ్మారి కకావికలం చేస్తున్నది. వ్యాక్సిన్‌ రాకపోవడం, సరైన మందుల్లేకపోవడంతో ప్రపంచం వణికిపోతున్నది. ఈ తరుణంలో ఎడారిలో ఒయాసిస్సులా కనిపిస్తున్న దివ్యౌషధం ప్లాస్మా థెరపీ. కొవిడ్‌-19 చికిత్సల్లో ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నది అదొక్కటే.!  తాజాగా హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ దవాఖానలో ప్లాస్మాబ్యాంకును ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో ప్లాస్మా బ్యాంకులు ఏర్పాటుపై చర్చ జరుగుతున్నది. తెలంగాణలో రికవరీ రేటు పెరుగుతుండటంతో, బ్యాంకులు ఏర్పాటుచేయడం వల్ల దాతల నుంచి ప్లా స్మాను సేకరించి నిల్వ చేసుకోవచ్చని భావిస్తున్నది. భారత వైద్య పరిశోధన మండలి ప్లాస్మా థెరపీకి అనుమతులను సులభతరం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు కార్పొరేట్‌ దవాఖానల్లో ఈ చికిత్స అందుబాటులో ఉన్నది. ఈ థెరపీతో రోగులు కోలుకుంటుండటంతో రోజురోజుకూ డిమాండ్‌ పెరుగుతున్నది. 

ఏమిటీ ప్లాస్మా థెరపీ?

కోలుకున్న వ్యక్తి రక్తం నుంచి ప్లాస్మా తీసి.. మరో రోగి రక్తలో ఉన్న వైరస్‌ను అంతం చేయడమే ప్లాస్మా థెరపీ లక్ష్యం. 18వ శతాబ్దం నుంచి ఇది వాడుకలో ఉన్నట్టు ఆధారాలున్నాయి. స్పానిష్‌ ఫ్లూ, సార్స్‌, మెర్స్‌, ఎబోలా, హెచ్‌1ఎన్‌1 లాంటి మహమ్మారిలకు ఇదే పద్ధతిని ఉపయోగించారు. ఏ వ్యాధి చికిత్సకు వినియోగించుకోవాలనుకుంటున్నామో.. ఆ వ్యాధి సోకి కోలుకున్న వ్యక్తి నుంచి రక్తాన్ని సేకరించి ప్లాస్మాను వేరు చేసి భద్రపరుస్తారు. ఈ ప్లాస్మా కణాలను వ్యాధి సోకిన మరో వ్యక్తికి ఎక్కిస్తారు. వైరస్‌ సోకి కోలుకున్న మనిషి శరీరంలో అదే వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీస్‌ ఉత్పత్తి అవుతాయి. ఇవి ఆ వైరస్‌ తిరిగి ప్రవేశించకుండా నిరోధిస్తాయి.   

ఎవరు దానం చేయొచ్చు

కొవిడ్‌ సోకిన తర్వాత ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకొని తిరిగి 14 రోజుల వరకు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకపోతే ఆ వ్యక్తి ప్లాస్మా దానం చేయవచ్చు. ఎక్కువ శాతం 28 రోజుల తర్వాతనే ప్లాస్మా సేకరిస్తున్నారు. 18-60 ఏండ్ల లోపు 50 కిలోల కన్నా ఎక్కువ బరువు ఉన్న వారు అర్హులు. డయాబెటిస్‌, ఇన్సులిన్‌, క్యాన్సర్‌, గుండె, ఊపిరితిత్తుల సమస్యలున్నవారు, గర్భిణులు ప్లాస్మా దానానికి అనర్హులని ఐసీఎంఆర్‌ తెలిపింది. 50కిలోల కన్నా తక్కువ బరువున్న వారు, రక్త పోటు(బీపీ) 140 కన్నా ఎక్కువ ఉన్న వారు డయాస్టోలిక్‌ పీడనం 60 కన్నా తక్కువ -90 కన్నాఎక్కువ ఉన్న వారు కూడా అనర్హులని పేర్కొంది. అర్హులైన దాతలు ప్రతి రెండు వారాలకు 500 మిల్లీలీటర్ల ప్లాస్మాను దానం చేయవచ్చు. ఇలా సేకరించిన ప్లాస్మాను అతి శీతల వాతావరణంలో కనీసం సంవత్సరం దాకా భద్రపరవచ్చు.

ప్లాస్మా బ్యాంక్‌లో ఏం చేస్తారు

ప్లాస్మా బ్యాంకు ఏర్పాటు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. రక్తంలోని ప్లాస్మాను మాత్రమే తీసుకొని తిరిగి రక్త కణాలను మిషన్‌ ద్వారా శరీరంలోకి ఎక్కిస్తారు. సాధారణంగా రక్తం తీసేందుకు 10 నిమిషాలు పడితే ప్లాస్మా తీసేందుకు 45 నిమిషాల దాకా పడుతుంది. తీసుకున్న ప్లాస్మాను 24 గంటల్లో గడ్డ కట్టేలా చేస్తారు. దీనినే ఫ్రొసెన్‌ ప్లాస్మా అంటారు. దీనిని ఏడాదిపాటు నిర్దేశిత ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తారు. అవసరమైనప్పుడు దాన్ని కరిగించి వినియోగిస్తారు. ఒక వ్యక్తి ప్లాస్మాను ప్రతి 14 రోజులకు ఒకసారి 500 మిల్లీలీటర్ల వరకుదానం చేయొచ్చని, ఏటా 24 సార్ల కన్నా ఎక్కువ దానం చేయొద్దని వైద్య నిపుణులు చెప్తున్నారు.


logo