మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 02:25:47

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు పక్కా ప్రణాళిక

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు పక్కా ప్రణాళిక

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని కార్మికశాఖ తెలిపింది. పోలీస్‌, విద్య తదితర శాఖలు, ఎన్జీవోలతో కలిసి ఈ సామాజిక రుగ్మతను నిర్మూలించేందుకు కృషిచేస్తున్నామని పేర్కొన్నది. శుక్రవారం ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం ‘బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన రాష్ట్ర వనరుల విభాగం’ (ఎస్సార్సీ) ఈ మేరకు ఓ ప్రకటన విడుదలచేసింది. బాలకార్మిక నిర్మూలనకు రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీ కొనసాగుతున్నదని తెలిపింది. దీని ఆధ్వర్యంలో 33 జిల్లాల్లో ఎన్‌సీఎల్పీలు (నేషనల్‌ చైల్డ్‌ లేబర్‌ ప్రాజెక్టులు) ఏర్పాటయ్యాయని వివరించింది. బాలకార్మికులకు విద్యనందించేందుకు ప్రత్యేకంగా ఎన్సీఎల్పీ పాఠశాలలు నడుస్తున్నాయని పేర్కొన్నది. చట్టాల రూపకల్పనలో ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపింది. ఈ క్రమంలో ఎస్సార్సీ ఓ నాలెడ్జ్‌ హబ్‌గా ఉన్నదని చెప్పింది. ప్రపంచ కార్మిక సంస్థతో కలిసి ‘ప్రాథమిక సూత్రాలు, పని ప్రదేశంలో హక్కులు’ పైలట్‌ ప్రాజెక్టును నిర్వహిస్తున్నట్టు తెలిపింది. జోగుళాంబ గద్వాల, వరంగల్‌ రూరల్‌, ఆదిలాబాద్‌, నల్లగొండ జిల్లాల్లో ఈ ప్రాజెక్టు నడుస్తున్నదని పేర్కొన్నది. బాలకార్మిక వ్యవస్థ ఓ సామాజిక రుగ్మత అని, సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడి దీనిని పారదోలాలని పిలుపునిచ్చింది.


logo