శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 25, 2020 , 19:34:33

ఆయిల్‌ పామ్‌ సాగుకు తక్షణమే ప్రణాళికలు సిద్ధం చేయాలి : మంత్రి హరీశ్‌రావు

ఆయిల్‌ పామ్‌ సాగుకు తక్షణమే ప్రణాళికలు సిద్ధం చేయాలి : మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట : జిల్లాలో 55వేల ఎకరాల్లో ఆయిల్ పామ్‌ సాగుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, ఈ మేరకు జలాశయాల ఆయకట్టు పరిధిలో ప్రత్యామ్నాయ పంటగా సాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సిద్దిపేట నుంచి ఆయిల్‌ పామ్‌ సాగుపై ఉద్యానవన కమిషనర్ వెంకట్రామరెడ్డి, కలెక్టర్‌ వెంకట్రామరెడ్డి, జిల్లా ఉద్యానవన ఉప సంచాలకులు రామలక్ష్మి, మండలాల ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి సభ్యులు, పెదవేగి జాతీయ అయిల్ ఫాం పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు, ఖమ్మం, నల్గొండ ఆయిల్ ఫాం సాగు చేస్తున్న 1600 మంది రైతులతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు రెండుగంటల పాటు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

సంప్రదాయ పంటల సాగుతో పోల్చితే ఆయిల్‌ పామ్‌ సాగుతో రైతులకు అధిక లాభాలున్నాయని మంత్రి తెలిపారు. నాలుగేళ్ల నుంచి మొదలై.. 30 ఏళ్ల పాటు ఆయిల్ ఫాం దిగుబడి వస్తుందని చెప్పారు. అంతర పంటల సాగుకు సైతం అనుకూలమని చెప్పారు. ఎకరా వరికి అవసరమయ్యే నీటితో నాలుగెకరాల్లో ఈ పంటను సాగు చేయవచ్చని చెప్పారు. ఆయిల్‌ ఫాం సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు అందజేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో సాగు నీటి సౌకర్యం గణనీయంగా మెరుగైన నేపథ్యంలో సిద్ధిపేట రైతులు విస్తృతంగా ఆయిల్‌ పామ్‌ సాగును చేపట్టాలని సూచించారు.

ఈ మేరకు ఉద్యానవన అధికారులు, రైతు బంధు సమితి సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించి, సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. మంత్రి సూచనతో ఖమ్మం, నల్గొండ జిల్లాలో ఇది వరకే పంటను సాగు చేస్తూ లాభాలు గడిస్తున్న రైతులు తమ విజయగాధను టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా వివరించారు. ఆయిల్ ఫాం సాగు విధానం, కలిగే ప్రయోజనాలను, మార్కెటింగ్ సౌకర్యం తదితర అంశాలపై జాతీయ ఆయిల్ పామ్‌ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo