బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 00:42:19

అందమైన రైల్వేస్టేషన్‌.. మేడ్చల్‌

అందమైన రైల్వేస్టేషన్‌.. మేడ్చల్‌
  • కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ట్వీట్‌
  • సంతోషం వ్యక్తంచేసిన స్టేషన్‌మాస్టర్‌ సుదర్శన్‌

మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మేడ్చల్‌ రైల్వేస్టేషన్‌ను తెలంగాణలోని అందమైన రైల్వేస్టేషన్‌గా కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. శుక్రవారం ట్విట్టర్‌ వేదికగా కేంద్ర మంత్రి స్పందించారు. రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్‌ 4లోని మెట్లపై అందంగా చిత్రించిన జాతీయపక్షి నెమలి ఫొటోను, ప్లాట్‌ఫాం నంబర్‌ 5లోని మెట్లపై చిత్రించిన జాతీయ జంతువు పులి ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌చేసి హర్షం వ్యక్తంచేశారు. మంత్రి ట్విట్టర్‌పై ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి మేడ్చల్‌ రైల్వేస్టేషన్‌ మాస్టర్‌ సుదర్శన్‌ను సంప్రదించగా.. తమ ఇంటిలాగే స్టేషన్‌, పరిసరాలు ఉండాలనే లక్ష్యంతో క్లీన్‌ అండ్‌ గ్రీన్‌గా ఉంచుతున్నామన్నారు. 


డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ పర్యవేక్షణలో స్టేషన్‌ పరిసరాల్లోని ఖాళీ ప్రదేశాల్లో విస్తృతంగా మొక్కలు నాటామని, ప్రయాణికులు, సందర్శకుల సహకారంతో స్టేషన్‌ ప్లాట్‌ఫాంలను పరిశుభ్రంగా పెడుతున్నట్టు చెప్పారు. ఎంఎంటీఎస్‌ ఫేజ్‌-2లో భాగంగా త్వరలో మేడ్చల్‌ వరకు లోకల్‌ట్రైన్‌ నడిచే అవకాశం ఉన్నదని అన్నారు. మేడ్చల్‌ రైల్వేస్టేషన్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు రావడంపట్ల స్టేషన్‌మాస్టర్‌ సంతోషం వ్యక్తంచేశారు. రైల్వేస్టేషన్‌ స్వాగత ద్వారం వద్ద ఉన్న అలంకరణ మొక్కలు  ప్రయాణికులు, సందర్శకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి.


logo