శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 27, 2021 , 17:54:57

ఎస్ఐఎఫ్‌సీఏ క‌న్వీన‌ర్‌గా పిట్ట‌ల ర‌వీంద‌ర్ ఏక‌గ్రీవ ఎన్నిక‌

ఎస్ఐఎఫ్‌సీఏ క‌న్వీన‌ర్‌గా పిట్ట‌ల ర‌వీంద‌ర్ ఏక‌గ్రీవ ఎన్నిక‌

హైద‌రాబాద్ : దక్షిణ భారతీయ మత్స్యకార జాతుల ఐక్యవేదిక( South Indian Fishermen Communities Association) కన్వీనర్‌గా తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టల రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నాటకలోని మంగళూరు నగరంలో "దక్షిణ భారతీయ మత్స్యకార జాతుల ఐక్యవేదిక" ఏర్పాటు సమావేశం ఇటీవల జరిగింది. కర్నాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గోవా రాష్ర్టాలతో పాటు, పాండిచ్చేరి, లక్ష్యదీవులు, అండమాన్ నికోబార్ దీవుల నుండి హాజరైన వివిధ మత్స్యకార జాతులు, కులాల ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఐక్యవేదిక కమిటీ కన్వీనర్‌గా పిట్టల రవీందర్‌ను కర్నాటక విధానసభ సభ్యులు (ఎమ్మెల్సీ) ప్రొఫెసర్ సబ్బన్నా తల్వార్ ప్రతిపాదించగా హాజరైన ప్రతినిధులందరూ ఏకగ్రీవంగా ఆమోదించి ఎన్నుకున్నారు. బుధవారం ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.   

ఈ సంద‌ర్భంగా పిట్ట‌ల ర‌వీంద‌ర్ మాట్లాడారు. దక్షిణ భారతదేశంలో వివిధ కులాలు, జాతుల పేర్లతో ఉనికిలో ఉన్న మత్స్యకారులంద‌రినీ సంఘటితం చేసేందుకే మ‌త్స్య‌కార జాతుల ఐక్య‌వేదిక‌ను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. వారిని సామాజికంగా, ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించి అమలుపరచాలనే ఏకైక లక్ష్యంతో రాజకీయాలకు అతీతంగా దక్షిణ భారతీయ మత్స్యకార జాతుల ఐక్యవేదిక ఏర్పాటైంద‌న్నారు.  

భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో గంగపుత్ర, గంగా మాత, ముదిరాజు, కబ్బలిగ, తెనుగు, కోళీ, ముత్తరాయర్, ధీవర, అరయ, మఘవీరలాంటి అనేక జాతులుగా, ఉపకులాలుగా విడిపోవడం వల్ల ఈ జాతులకు సంబంధించిన ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి పోతున్నారన్నారు. ఈ జాతులు, కులాల మధ్యన ఐక్యతను సాధించేందుకు అవసరమైన సమన్వయాన్ని చేసేందుకు ఈ "దక్షిణ భారతీయ మత్స్యకార జాతుల ఐక్యవేదిక" కృషి చేస్తుందని తెలిపారు. ఇందుకు మత్స్యకార జాతులకు సంబంధించిన సంఘాలు అవసరమైన సహాయ, సహకారాలను అందించాలని పిట్టల రవీందర్ కోరారు.

VIDEOS

logo