శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 13:50:24

రైతు గుండెల నిండా గులాబీ జెండా..!

రైతు గుండెల నిండా గులాబీ జెండా..!

వరంగల్ రూరల్ : కొత్త రెవెన్యూ చ‌ట్టం తెచ్చిన ఆనందం అంతా ఇంతా కాదు. ఆ చ‌ట్టానికి సంబంధించిన బిల్లు అసెంబ్లీలో అమోదం పొందిన నాటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో హ‌ర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని వరి పొలంలో ఓ రైతు టీఆర్ఎస్ జెండాను పెట్టుకొని మరీ పొలం పనులు చేసుకుంటున్నాడు. కాగా, అటుగా వెళ్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఈ దృశ్యం ఆకర్షించింది.

చుట్టూ ఆకు ప‌చ్చని పొలాల్లో గులాబీ జెండా రెప‌రెప‌ల మ‌ధ్య‌, రైతులు, కూలీలు ప‌నులు చేసుకుంటుండటం చూసిన మంత్రి వెంట‌నే త‌న వాహ‌నాన్ని ఆపించారు. నేరుగా ఆ రైతు వ‌ద్దకు వెళ్లి అతడిని అభినందించారు. రైతుల‌తో క‌లిసి పార్టీ జెండాను మోశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, గులాబీ జెండా జ‌నం గుండెల నిండా నింపుకుంటున్నారని పేర్కొన్నారు. నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా పంట పొలాల్లో జెండా ఎగురవేయడం అభినందనీయమన్నారు.


సీఎం కేసీఆర్ ని త‌మ గుండెల్లో నిలుపుకున్నార‌న‌డానికి ఈ దృశ్యమే నిద‌ర్శనమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేప‌ట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు ప్రజలకు బాగా చేరువ అయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని న‌రేంద‌ర్ స్థానిక సర్పంచ్ సుంకరి సాంబయ్య, ఉపసర్పంచ్ మడ్డి రాజ్ కుమార్, ఎంపీటీసీ గొడిశాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.logo