కడక్‌నాథ్ కోడి.. కాసుల వర్షం కురిపిస్తున్నది. పోషకాల గనిగా ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ నల్లకోడి.. రైతులకు లాభాలను తెచ్చే ‘బంగారు బాతు’గా మారింది. ముక్క లేనిదే ముద్ద దిగని మాంసప్రియుల ఆరోగ్యానికి దివ్యౌషధమైంది. ఫలితంగా మార్కెట్లో నాటుకోళ్లకు దీటుగా అమ్ముడుపోతున్నది. వ్యవసాయరంగానికి అనుబంధంగా సన్న,చిన్నకారు రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయవనరుగా నిలుస్తున్నది.
కోళ్లలో ‘కడక్‌నాథ్ కోడి’ వేరయా.. అంటున్నారు చికెన్ ప్రియులు. ఇన్నాళ్లూ నాటుకోడి, ఫారం కోడి మాంసాన్నే తిన్నవారు, ఇప్పుడు ‘కడక్‌నాథ్ కోడి’కి ఫిదా అవుతున్నారు. ఒకప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ర్టాలకే పరిమితమైన నల్లకోళ్లు, ఇప్పుడు తెలంగాణలోనూ విరివిగా ఎదుగుతున్నాయి. సాధారణ ఫారం కోళ్లు తెల్లగా, నాటుకోళ్లు ఎరుపు, ఇతర రంగుల్లో ఉంటాయి. కానీ, కడక్‌నాథ్ కోడి పూర్తి నల్లగా ఉంటుంది. కాలిగోర్లు మొదలు ఈకలదాకా.. రక్తం, మాంసంకూడా నలుపు రంగులోనే. అదే ఈ కోడి ప్రత్యేకత. చూసేందుకు నల్లగానే ఉన్నా, ఇందులో ఆరోగ్యాన్నిచ్చే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీంతో, జనం క్రమంగా కడక్‌నాథ్ చికెన్ తినేందుకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా మార్కెట్లో నల్లకోడి మాంసానికి డిమాండ్ పెరుగుతున్నది. పలువురు రైతులు వ్యవసాయానికి అనుబంధంగా కడక్‌నాథ్ కోళ్ల పెంపకం పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతున్నారు.
కడక్‌నాథ్ కోడి మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందినది. అక్కడి నుంచి క్రమంగా దేశమంతా వ్యాపించింది. స్థానికంగా కడక్‌నాథ్ కోళ్లను పెంచే రైతులు మధ్య ప్రదేశ్ నుంచే ఎక్కువగా పిల్లలను కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో పిల్ల ధర రూ. 60 నుంచి రూ. 80 వరకు పలుకుతున్నది. ఒక్కరోజు వయస్సు ఉన్న పిల్లలను కొనుగోలు చేసి, పెరటి కోళ్ల మాదిరిగానే పెంచుకోవచ్చు. ఇవి అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకొంటాయి. అందుకే, మధ్యప్రదేశ్‌లో మూలా లున్నా.. మన తెలంగాణ వాతావరణంలో బాగానే పెరుగుతున్నాయి.
బాయిలర్ కోళ్లతో పోలిస్తే కడక్‌నాథ్ కోళ్ల పెంపక సమయం ఎక్కువ. చేతికి వచ్చేందుకు కనీసం 120 రోజుల సమయం పడుతుంది. అప్పటికి ఒక్కో కోడి 1.5 కేజీల బరువు పెరుగుతుంది. అదే పుంజు అయితే రెండు కేజీల వరకూ వస్తుంది. ఇంకా ఎక్కువ రోజులుంచితే.. అంతకంటే ఎక్కువ బరువు పెరిగే అవకాశం ఉంటుంది. తూకం పెరిగినకొద్దీ ధర పెరుగుతుంది.
కడక్‌నాథ్ కోళ్ల పెంపకం రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని అందిస్తున్నది. వీటి మాంసానికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. కిలో రూ.1200 నుంచి రూ.1400 వరకూ పలుకుతున్నది. అదే విధంగా లైవ్ కోడి ధరకూడా కిలో రూ. 600 నుంచి రూ.800 వరకూ ఉన్నది. అంటే, ఒక రైతు 120 రోజులపాటు ఈ కోళ్లను పెంచితే, సుమారు 1.5ల కేజీల బరువు వస్తాయి. ఒక కోడి పెంపకానికి రూ.200 నుంచి రూ.250 వరకూ ఖర్చవుతుంది. ఈ లెక్కన అన్ని వ్యయాలూ పోను, ఒక్కో కోడిపై కనీసం రూ.700 నుంచి రూ.900 వరకూ మిగులుతుంది. ఈ విధంగా ఒక రైతు వందకోళ్లను పెంచినట్లయితే రూ.25వేలు ఖర్చు అవుతుంది. అదే ఆదాయాన్ని పరిశీలిస్తే.. రైతుకు నికరంగా రూ.80వేల నుంచి రూ. లక్ష వరకూ ఆదాయం సమకూరుతుంది.
కడక్‌నాథ్ కోడి మాంసానికే కాదు, గుడ్లకూ భారీ డిమాండ్ ఉంది. ఒక్కో గుడ్డు రూ.40 నుంచి రూ.50 వరకూ పలుకుతున్నది. కోడి ఆరునుంచి ఏడు నెలల్లో గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది. సంవత్సరంలో ఒక కోడి సుమారు 100 నుంచి 120 గుడ్లు పెడుతుంది. వీటిని విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. అయితే, కడక్‌నాథ్ కోళ్లు గుడ్లను పొదగలేవు. కాబట్టి, నాటు కోళ్లద్వారా వీటి గుడ్లను పొదగాల్సి ఉంటుంది. లేదంటే ప్రత్యేక ఇన్క్యుబేటర్ల ద్వారా కూడా పొదిగించవచ్చు. దీని వల్ల మళ్లీ పిల్లల్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా, పిల్లల్ని అమ్మడం ద్వారా రైతు మరింత ఆదాయాన్ని పొందవచ్చు.
రైతులు పంటలపైనే పూర్తిగా ఆధారపడకుండా వ్యవసాయానికి అనుబంధంగా, కడక్‌నాథ్ కోళ్ల పెంపకాన్ని చేపట్టవచ్చు. సేద్యంలో అనుకోని నష్టం వచ్చినా, కష్టకాలంలో అదనపు ఆదాయం ఆదుకుంటుంది. దీనికోసం ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరమేం లేదు. ఉదయం, సాయంత్రం కొన్ని గంటలు సరిపోతుంది. అంతేకాకుండా పెంపకం పెద్ద కష్టమేమీ కాదు. ఫారం కోళ్ల మాదిరిగానే కడక్‌నాథ్ కోళ్లనూ పెంచుకోవచ్చు. మొదటి నెలరోజులు ఫారం కోళ్లకు ఇచ్చే కొన్నిరకాల వ్యాక్సిన్లు వీటికీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేకమైన దానాకూడా అవసరం లేదు. నూకలు, తవుడు, మక్కజొన్న పిండి వంటివి పెట్టవచ్చు. ముఖ్యంగా కడక్‌నాథ్ కోళ్లు ‘అగోలా’ నాచు రకానికి చెందిన ఆకులను ఇష్టంగా తింటాయి. వీటిని అందిస్తే రైతుకు దానా ఖర్చు తగ్గడంతోపాటు కోళ్లూ ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇక మార్కెటింగ్ కూడా సులువుగా చేసుకొనే అవకాశం ఉన్నది. వీటి ప్రత్యేకత, పోషక విలువలు తెలిసిన వారు స్వయంగా ఫారం వద్దకే వచ్చి, బేరమాడకుండానే కొనుగోలు చేస్తుంటారు. నగరాలు, పట్టణాల్లోని పెద్దపెద్ద చికెన్ సెంటర్లు, రెస్టారెంట్ల నిర్వాహకులకూ సరఫరా చేసే అవకాశం ఉంటుంది. హైదరా బాద్ లాంటి చోట్ల కడక్‌నాథ్ రెస్టారెంట్లూ వెలుస్తున్నాయి.
కడక్‌నాథ్ కోడి మాంసంలో అనేక ఔషధ గుణాలున్నాయని పరిశోధనల్లో తేలింది. బీపీ, షుగర్, గుండె జబ్బులు, ఆస్తమా, ఊబకాయం తదితర వ్యాధులకు ఇది చక్కని ఔషధంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలున్నాయి. విటమిన్ బీ1, బీ2, బీ6 బీ12, విటమిన్ సితోపాటు అనేక రకాల ప్రొటీన్లు ఉన్నట్లు నిర్ధారించారు. కడక్‌నాథ్ కోడి మాంసంలో కొవ్వు 0 నుంచి 1శాతం మాత్రమే ఉంటుంది. ఇలా అనేక ఔషధ గుణాలతో.. మనిషి ఆరోగ్యానికి మేలు చేస్తున్నది కడక్‌నాథ్ కోడి. అదనంగా, జిహ్వకు కూడా విందే.
నేను మూడేండ్లుగా కడక్‌నాథ్ కోళ్లను పెంచుతున్నా. మంచి లాభాలు పొందుతున్నా. ప్రస్తుతం నా ఫారం దగ్గరే లైవ్ బర్డ్‌ను కేజీ రూ.600 నుంచి రూ.700 వరకూ విక్రయిస్తున్నా. గుడ్లద్వారా అదనపు ఆదాయం వస్తున్నది. నన్ను చూసి మా గ్రామంలోనూ చాలామంది రైతులు కడక్‌నాథ్ కోళ్ల పెంపకాన్ని ప్రారంభించారు. అందరూ సంతోషంగానే ఉన్నారు.
– భిక్షపతి, రైతు, నర్సాపూర్, మెదక్
స్వామిరెడ్డి కొమ్మిడి