శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 01:46:11

ప్రెస్‌ బ్యూరోనా బీజేపీ బాకానా?

ప్రెస్‌ బ్యూరోనా బీజేపీ బాకానా?

  • రాష్ట్రంపై విషం చిమ్మిన పీఐబీ ప్రకటన
  • సర్కారుపై హైకోర్టు విరుచుకుపడిందట
  • సంజాయిషీ ఇవ్వాల్సిందిగా అడిగిందట
  • టెస్టులను ఆలస్యంగా మొదలుపెట్టారట
  • ఐసీఎమ్మార్‌ గైడ్‌లైన్స్‌ని పాటించడం లేదట
  • నిందలు మోపిన కేంద్ర సర్కారు సంస్థ 
  • బీజేపీ నేతల ప్రకటనల రీతిలో బులెటిన్‌
  • ఖండించిన ప్రజారోగ్య డైరెక్టర్‌ శ్రీనివాసరావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) అని ఘనత వహించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒకటుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన, దేశవ్యాప్తంగా జరిగిన సంఘటనల సాధికారిక సమాచారాన్ని వార్తా సంస్థలకు, ప్రజలకు అందించడం దాని విధుల్లో ఒకటి. ఒక రకంగా దీన్ని కేంద్రం ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే సమాచార స్రవంతిగా భావించవచ్చు. ఇదే క్రమంలో పీఐబీ.. దేశవ్యాప్తంగా కరోనాకు సంబంధించిన సమాచారాన్ని  రోజువారీ బులెటిన్‌ను విడుదల చేస్తున్నది. ప్రతి రాష్ట్రంలో తాజాగా నమోదైన కరోనా కేసులు, మరణాలు, కోలుకున్న వారి సంఖ్యల్ని అందులో పొందుపరుస్తున్నది.

ఇదేరీతిన మంగళవారం కూడా పీఐబీ బులెటిన్‌ విడుదల చేసింది. ఇందులో పీఐబీ అధికారులు తెలంగాణపై విషం చిమ్మారు. తాము  ప్రభుత్వ ఉద్యోగులమ ని, ప్రజల సొమ్ముతో వేతనాలు తీసుకుంటున్నామని మరిచి, బీజేపీ నేతల నోట్లోం చి ఊడిపడ్డట్టుగా పరుష పదజాలంతో బులెటిన్‌ను విడుదలచేశారు. మిగతా అన్ని రాష్ర్టాల్లో కరోనాపై గణాంకాల వెల్లడికే పరిమితమైన పీఐబీ అధికారులు తెలంగాణ విషయంలో కటువైన పదజాలం ఉపయోగించారు. అదెలా ఉందో చూడండి. ‘భారీ ఎత్తున కరోనా టెస్టులను చేయనందుకు హైకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడింది. దీనిపై సంజాయిషీ ఇచ్చేందుకు రావాల్సిందిగా ప్రజారోగ్య డైరెక్టర్‌ శ్రీనివాసరావును ఆదేశించింది’ అని పీఐబీ తన బులెటిన్‌లో పేర్కొంది. నిజానికి ఆయా రాష్ర్టాల్లో ఎన్ని కొత్త కేసులు నమోదయ్యాయి? ఎందరు చనిపోయా రు? ఎందరికి నయమైంది? తదితర వివరాలు ఇవ్వడమే పీఐబీ చేసేది. మిగతా రాష్ర్టాల విషయంలో ఈ ప్రాతిపదికనే పాటించింది. 

కానీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి  బులెటిన్‌లో తీవ్ర వ్యాఖ్యానాలు చేసింది. బులెటిన్‌లో ఇంకా ఏమున్నదంటే... ‘తెలంగాణ చాలా ఆలస్యంగా ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులను మొదలుపెట్టింది.  అందులో కూడా అది ఐసీఎమ్మార్‌ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించడం లేదు’ అని బులెటిన్‌లో విమర్శించారు. ‘యాంటిజెన్‌ టెస్టులో నెగిటివ్‌ వచ్చినవారు .. ఆర్టీ- పీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని ఐసీఎమ్మార్‌ సూచించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం కరోనా లక్షణాలున్నవారిని మళ్లీ టెస్టుకు పంపకుండా, ఐసొలేషన్‌కు పంపాలని నిర్ణయించింది’ అని పేర్కొన్నది. దేశంలోని ఇతర రాష్ర్టాల సమాచారానికో రీతి.. తెలంగాణ విషయంలో మరో నీతి అన్నట్టు వ్యవహరించారు  మరే రాష్ట్రం విషయంలోనూ ఇలాంటి వ్యాఖ్యానాల జోలికి పోని పీఐ బీ.. తెలంగాణ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వమేదో తప్పుచేస్తున్నట్టు నిరూపించడానికి ప్రయత్నించింది. 

బీజేపీ రాష్ట్ర నేత లు కొన్ని రోజులుగా చేస్తున్న ఆరోపణల తరహాలోనే పీఐబీ బులెటిన్‌ సారాంశం ఉండటం గమనార్హం. దీంతో పీఐబీ కేంద్ర ప్రభుత్వ సంస్థనా, బీజేపీ జేబు సంస్థనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దేశవ్యాప్తంగా అనేక వార్తా సంస్థలకు పీఐబీ ఇచ్చే సమాచారమే ఆధారం. ఈ నేపథ్యం లో జాతీయస్థాయిలో తెలంగాణను అప్రతిష్ఠ పాల్జేయడానికే కుట్ర పూరితంగా ఇలాంటి పని చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  కరోనా నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో కుప్పలు తెప్పలుగా అబద్దపు ప్రచారాలు.. ప్రభుత్వ చర్యలకు ఆటంకం కలిగించేలా, ప్రజల్లో లేనిపోని భయాందోళనలు సృష్టించేలా, చివరకు వైద్యుల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేలా వాస్తవాల వక్రీకరణలు జరుగుతున్నాయి. ఇదేదో ఆకతాయిలు చేశారంటే  కట్టడి చేయవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వ అధీనంలోని బాధ్యతాయుతమైన ఒక విభాగం బాధ్యతారాహితంగా వ్యవహరించడం గమనార్హం. వాస్తవ సమాచారాన్ని కేంద్రానికి,  ప్రజలకు అందించాల్సిన అధికారులు బీజేపీ నాయకుల రాజకీయ విమర్శల్ని తమ అధికారిక బులెటిన్‌లో పొందుపరిచారని, ప్రాణాలకు తెగించి కొవిడ్‌-19తో పోరాడుతున్న తెలంగాణ వైద్యుల పనితీరును అవమానించారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు విమర్శిస్తున్నాయి. ‘కరోనాతో ప్ర పంచమే అతలాకుతలం అవుతున్నది. దీన్నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలకు భరోసానిచ్చేలా ప్రభుత్వాలకు బాసటగా నిలవాల్సిన పీఐబీ మా త్రం రాజకీయ రొంపిలో విశృంఖలంగా వ్యవహరించింది’ అని సీనియర్‌ అధికారి ఒకరు ఆగ్రహం వెలిబుచ్చారు. 

ఇది దారుణం: డైరెక్టర్‌

పీఐబీ బులెటిన్‌లో తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశారని రాష్ట్ర ప్రజారోగ్య డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తంచేశారు. పీఐబీ ప్రకటనను తీవ్రంగా ఖండించారు. ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘తెలంగాణ ప్రభుత్వంపై పీఐబీ నిందలు మోపుతున్నది. బట్టగాల్చి మీద వేసేలా వ్యవహరిస్తున్నది. బురదజల్లుతున్నది. నిజానికి కరోనా టెస్టులు, దవాఖానల సన్నద్ధత, కేసుల నిర్వహణ విషయంలో పరిస్థితిని హైకోర్టు సమీక్షించిందంతే. ప్రభుత్వ కృషిని న్యాయమూర్తు లు ప్రశంసించారు కూడా. కేంద్ర ప్రభు త్వం, ఐసీఎమ్మార్‌ మార్గదర్శకాలు, ప్రొటోకాల్స్‌ను తెలంగాణ ప్రభుత్వం తు.చ. తప్పకుండా పాటించింది. పీఐబీ ఇచ్చిన ప్రకటన పూర్తిగా నిరాధారం. కరోనా విషయం లో తెలంగాణ సర్కారుపై బురదజల్లేలా అది ఉన్నది’అని శ్రీనివాసరావు  ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఇలాంటి తప్పుడు వార్తల పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉం డాలి. కరోనా నుంచి పౌరులను కాపాడడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నది’ అని ఆయన వివరించారు.

ఇదేం క్రికెట్‌ మ్యాచ్‌ కాదు

  • సీఎం అన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు 
  • ప్రతిపక్షాలది దుష్ప్రచారం: ఎంపీ అసద్‌ 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కనిపించడం లేదంటూ కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను సీఎం కేసీఆర్‌ నిత్యం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. అసదుద్దీన్‌ ఒవైసీ మంగళవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి ప్రతిరోజూ మాట్లాడుతున్నారని, ప్రభుత్వ పథకాలు యథావిధిగా కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. తానే స్వయంగా ముఖ్యమంత్రితో మాట్లాడినట్టు చాలాసార్లు  చెప్పానని గుర్తుచేశారు. అయినా కొందరు అనవసరంగా సోషల్‌ మీడియాలో విమర్శిస్తున్నారని మండిపడ్డారు. దీనిని ప్రజలు నమ్మడం లేదన్నారు. ‘మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ.. వీళ్లంతా ఉన్నారు కదా. ముఖ్యమంత్రి ఫీల్డ్‌లో ఉండటానికి ఇదేం క్రికెట్‌ మ్యాచ్‌ కాదు. ఆయన అన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. సచివాలయం కూల్చివేతలో భాగంగా దెబ్బతిన్న మసీదు స్థానంలో కొత్తదానిని మరింత విశాలంగా కట్టాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.


logo