గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 02:20:28

ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫ్‌ బీజేపీ!

ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫ్‌ బీజేపీ!

  • బుద్ధి మార్చుకోని కేంద్ర ప్రభుత్వ సంస్థ
  • కొవిడ్‌ పరీక్షల్లో తప్పుడు లెక్కలు
  • తెలంగాణను బద్నాం చేసేందుకు మరోయత్నం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) మరోసారి తెలంగాణపై విషం కక్కింది. ప్రతి రోజు దేశంలో కొవిడ్‌ కేసుల పరిస్థితి గురించి వివరించే బులిటెన్‌లో ఇప్పటికే రాష్ట్రంపై పక్షపాతం చూపగా, బుధవారం మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శించింది. రాష్ర్టాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నం చేసింది. ప్రతి పది లక్షల జనాభాలో ప్రతి రోజు 140 కొవిడ్‌ పరీక్షలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. దీని ప్రకారం.. దేశంలో 22 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అంతకంటే ఎక్కువే పరీక్షలు చేస్తున్నాయని పీఐబీ అధికారిక నోట్‌లో పేర్కొంది. ఏయే రాష్ట్రంలో ఎన్ని పరీక్షలు చేస్తున్నారన్న వివరాలను అందులో పొందుపరిచింది. 

ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. డబ్ల్యూహెచ్‌వో, ఐసీఎంఆర్‌ నిబంధనలు పాటిస్తూ పెద్ద మొత్తంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం పేరును మాత్రం ఇందులో పొందుపరచలేదు. మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం వంటి చిన్న రాష్ర్టాలు, ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల పేర్లను సైతం ప్రస్తావించిన పీఐబీ.. తెలంగాణ ఊసులేకుండా నోట్‌ విడుదల చేసింది. పీఐబీ ప్రవర్తనపై వైద్యాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. క్లిష్టసమయంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తుంటే పరీక్షలు చేయడం లేదని  చెప్పేలా పీఐబీ వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, పీఐబీ ఉద్దేశపూర్వకంగానే తప్పులు చేస్తున్నదని పలువురు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేతల ఆరోపణలు తప్పని తేలుతాయన్న భయంతోనే బయటికి చెప్పలేదని విమర్శిస్తున్నారు.

14 రాష్ర్టాల కంటే ఎక్కువ పరీక్షలు..

పీఐబీ ఇచ్చిన నోట్‌ ప్రకారం చూసుకున్నా తెలంగాణలో పరీక్షల సంఖ్య 22 రాష్ర్టాల్లోని 14 రాష్ర్టాల కంటే ఎక్కువే. కర్ణాటక, ఏపీ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, కేరళ కంటే తెలంగాణ మెరుగైన స్థితిలో ఉన్నది. గత పది రోజుల నుంచి రాష్ట్రంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం పెద్ద సంఖ్యలో నిర్వహిస్తున్నది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలకు తోడు యాంటీజెన్‌ పరీక్షలను నిర్వహిస్తున్నది. అయినా.. పీఐబీ మాత్రం తెలంగాణ వివరాలను ప్రజలక తెలియచేసేందుకు ముఖం చాటేయడం గమనార్హం.

వాస్తవ గణాంకాలివీ..

  • డబ్ల్యూహెచ్‌వో సూచన- ప్రతి పది లక్షల జనాభాకు రోజుకు 140 పరీక్షలు చేయాలి.
  • ఈ లెక్కన రాష్ట్రంలో చేయాల్సిన పరీక్షలు - 5,600 (4 కోట్ల జనాభా).
  • జూలై 14న రాష్ట్రంలో జరిగిన పరీక్షలు - 13,175
  • ప్రతి పది లక్షల జనాభాకు జరిగిన పరీక్షలు  329
  • జాతీయ స్థాయి సగటు  201. దీన్ని మించి రాష్ట్రంలో పరీక్షలు జరుగుతున్నాయి.


logo