మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 14:38:42

చరిత్రలో వైద్యుల సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి

చరిత్రలో వైద్యుల సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి

కామారెడ్డి : వైద్యులు కనబడని శత్రువుతో పోరాటం చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జిల్లాలో కరోనా, సీజనల్ వ్యాధులపై జిల్లా అధికారులతో మంత్రులు ఈటల రాజేందర్, మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ..చరిత్రలో వైద్యుల సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. భగవంతుని తర్వాత గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నది వైద్యులు మాత్రమే. 81 శాతం మందికి ఎలాంటి కరోనా లక్షణాలు కనబడవని వివరించారు. 

19 శాతం మందికి మాత్రమే డాక్టర్ల సేవలు అవసరం ఉంటాయని పేర్కొన్నారు. కరోనా బారినుంచి  ప్రజల ప్రాణాలను కాపాడడానికి ముఖ్యమంత్రి ఎంత ఖర్చయినా వెనుకాడొద్దని చెప్పినట్లు వివరించారు. కంటైన్మెంట్అనే పదానికి అర్థం చెప్పింది తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని వెల్లడించారు. సంపూర్ణంగా  లాక్ డౌన్ ను అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. మరణాల రేటు కూడా  రాష్ట్రంలో తక్కువగా ఉందన్నారు. ప్రతిపక్షాలు, కొంతమంది మేధావులు, మీడియా  వైద్యుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. వార్తలను ప్రచురిస్తున్నారు ఇది బాధాకరమన్నారు. 


త్వరలోనే వైద్యరంగంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయన్నారు. వైద్యులు ఆత్మస్థైర్యం తో తగు జాగ్రత్తలు తీసుకుంటూ సేవలందించాలని సూచించారు. మంత్రి వేముల పశ్రాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కష్టకాలంలో డాక్టర్లు అందిస్తున్న సేవలు అద్భుతమని కితాబిచ్చారు. కరోనా కట్టడికి మంత్రి ఈటల రాజేందర్ చేస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 634 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో చాలామంది కోలుకొని ఇంటికి వెళ్లారు. రానున్న రోజుల్లో సీజనల్ వ్యాధులతో పాటు కరోనా పెరిగే అవకాశం ఉంటుంది ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి వేముల సూచించారు. జిల్లాలో ఉన్న హాస్పిటల్లో సమస్య లు కొద్దిరోజుల్లోనే తీరిపోతాయని హామీ ఇచ్చారు. logo