తెలుగుయూనివర్సిటీ, సెప్టెంబర్ 7: ఇంటర్నెట్లో అతిపెద్ద స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వమైన తెలుగు వికీపీడియా అరుదైన ఘనత సాధించింది. తెలుగు వికీపీడియాలోని 28,605 వ్యాసాల్లో ఫొటో లు, మ్యాపులు చేర్చి ప్రపంచ వికీపీడియాల్లో మూడో స్థానంలో నిలిచింది. జూలై-ఆగస్టు నెలల్లో వికీపీడియా పేజెస్ వాంటింగ్ ఫొటోస్-2021 పేరుతో ఓ పోటీ నిర్వహించారు. రెండునెలల పాటు సుమారు 22,700 గ్రామాల వ్యాసాల్లో మ్యాపులను చేర్చి రికార్డు సృష్టించారు. తెలుగు వికీపీడియాలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 30వేల గ్రామాలపై ఉన్న వ్యాసాల్లో ఆయా గ్రామాల్లోని విద్య, వైద్య, రవాణా సౌకర్యాలు, దర్శనీయ ప్రదేశాలు వంటివాటికి సంబంధించిన మ్యాపులను కూడా చేర్చారు.