మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 03, 2020 , 02:41:32

వైరస్‌లకు పరిష్కారం ఫార్మా సిటీ

వైరస్‌లకు పరిష్కారం ఫార్మా సిటీ

  • ప్రపంచ ఆరోగ్య సమస్యలన్నింటికీ ఇక్కడే పరిష్కారం
  • కొద్ది నెలల్లో ప్రారంభానికి మొదటి దశ సిద్ధం
  • హైదరాబాద్‌ లైఫ్‌సైన్సెస్‌కు ప్రాధాన్యం
  • కరోనా వ్యాక్సిన్‌ తయారీకి ప్రయత్నాలు
  • ఫార్మాసిటీపై సమీక్షలో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రస్తుత కరోనా సంక్షోభం నేపథ్యంలో ఫార్మా సిటీ ప్రాధాన్యం పెరిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌ నగరం లైఫ్‌ సైన్సెస్‌లో తనదైన గుర్తింపు పొందిందని తెలిపారు. హైదరాబాద్‌లో రూపుదిద్దుకుంటున్న ఫార్మా సిటీ నగరాన్ని అంతర్జాతీయ పటంలో ప్రత్యేకంగా నిలుపగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రగతిభవన్‌లో గురువారం హైదరాబాద్‌ ఫార్మాసిటీ పనుల పురోగతిపై అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. 

రానున్న కొద్ది నెలల్లో ఫార్మా సిటీ మొదటి దశ ప్రారంభమయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు కేటీఆర్‌కు తెలిపారు. ఫార్మా సిటీకి కావాల్సిన రోడ్లు, మౌలిక సదుపాయాలకు సంబంధించి మంత్రి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఐదేండ్లలో ఏ సంవత్సరం, ఏ కార్యక్రమాలు చేపడుతారో, ఎలాంటి పురోగతి సాధించాబోతున్నారో తెలిపే టైంలైన్‌తో కూడిన నివేదికను సమర్పించాలని మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి కరోనాకి అవసరమైన మందులతో పాటు వ్యాక్సిన్‌ తయారీకి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. 


ఇకముందు కూడా ఫార్మా సిటీ ద్వారా వైరస్‌లకు, వ్యాధులకు ఇక్కడినుంచే పరిష్కారం లభించగలదన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తంచేశారు. ఇప్పటికే అమెరికాకు చెందిన యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అత్యధిక అనుమతులు పొందుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ కూడా ఉందని కేటీఆర్‌ గుర్తుచేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా క్లస్టర్‌గా హైదరాబాద్‌ నిలవబోతున్నదని, ఫార్మా సిటీ జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టుగా ఉండబోతున్నదని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫార్మా సిటీని తీర్చిదిద్దాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తమ శాఖ పనిచేస్తున్నదని కేటీఆర్‌ చెప్పారు. 

ఫార్మా సిటీ ఫార్మా ఉత్పత్తులను తయారుచేసే కంపెనీలతోపాటు అందులో పనిచేసే కార్మికులకు కూడా అవసరమైన నివాస సదుపాయాలను కల్పించే ఒక స్వయంసమృద్ధి కలిగిన టౌన్‌షిప్‌గా ఉండాలన్న బృహత్తర లక్ష్యంతో ముందుకుపోవాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌ ఫార్మా సిటీలో కేవలం ఉత్పత్తుల తయారీ మాత్రమే కాకుండా ఫార్మా పరిశోధన , అభివృద్ధి సౌకర్యాలు, లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి ప్రత్యేకించి ఒక యూనివర్సిటీ, సాధ్యమైనంత ఎక్కువగా గ్రీన్‌ కవర్‌ వంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మాజీ మంత్రి సీ లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి, లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తినాగప్పన్‌ తదితరులు పాల్గొన్నారు.


logo