శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 09, 2020 , 20:56:54

పెళ్లి కొడుకుగా భద్రాద్రి రాముడు

పెళ్లి కొడుకుగా భద్రాద్రి రాముడు

భద్రాచలం : పాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకొని భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో ఈ రోజు రాములోరి కల్యాణ తలంబ్రాలు కలిపే వేడుక ఘనంగా జరిగింది. తొలుత అర్చకులు భద్రాద్రి రామున్ని పెళ్లికొడుకుగా, సీతమ్మవారిని పెళ్లి కూతురుగా అలంకరించారు. ఉత్సవ మూర్తులను బేడా మండపంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థాన కార్యనిర్వహణ అధికారి జి.నరసింహులు స్వామివారి శేషమాలికలను శిరస్సు పై ధరించి మంగళ వాయిద్యాల చప్పుళ్ల నడుమ పూజా సామగ్రితో చిత్రకూట మండపానికి చేరుకున్నారు.

అక్కడ ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యఃవచనం జరిపారు. గోదావరి తీర్థ పుణ్యజలాలను అర్చకులు తలంబ్రాల బియ్యంపై చల్లారు. తొమ్మిది మంది వైష్ణవ ముత్తైదువలు పసుపు కొమ్ములను రోళ్లలో పోసి దంచారు. 1108 మంది మహిళా భక్తులు తలంబ్రాలు కలిపారు. ఉభయ రాష్ర్టాల నుంచి భక్తులు తీసుకొచ్చిన గోటి తలంబ్రాలను సైతం వాటిలో కలిపారు. ఆస్థాన హరిదాసులు లాలలు, జోలలు, కీర్తనలు ఆలపించి స్వామివారికి డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు. వేడుకల్లో ఆలయ ప్రధాన అర్చకులు సీతారామానుజాచార్యులు, విజయ రాఘవచార్యులు తదితరులున్నారు. logo