శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 02:50:31

‘104’ను పటిష్ఠపర్చండి: హైకోర్టు

‘104’ను పటిష్ఠపర్చండి: హైకోర్టు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: 104 హెల్ప్‌లైన్‌ సేవలను పటిష్ఠం చేయాలని హైకోర్టు వైద్య, ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీచేసింది. కరోనా బాధితులకు 104 నంబర్‌ అందుబాటులో ఉండటం లే దని.. ఉస్మానియా, గాంధీతోపాటు అన్ని కార్పొరేట్‌ దవాఖానల్లో కరోనా పరీక్షలు జరిగేలా చూడాలని కోరుతూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ అంశాలపై ప్రభుత్వం కౌంటర్లు దాఖలుచేయాలని, ఈనెల 24న విచారణ చేపడుతామని తెలిపింది. 

ఎల్‌ఆర్‌ఎస్‌పై హైకోర్టులో పిటిషన్‌ 

అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణపై హైకోర్టులో పిల్‌ దాఖలైంది. జీవో నంబర్‌ 131ను కొట్టేయాలని కోరుతూ ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ త్వరలోనే విచారణకు వచ్చే అవకాశం ఉన్నది. 

బీఆర్‌ఎస్‌పై నివేదిక ఇవ్వండి: హైకోర్టు 

బీఆర్‌ఎస్‌ దరఖాస్తు వివరాలు సమర్పించాలని హైకోర్టు సోమవారం జీహెచ్‌ఎంసీకి ఆదేశాలు జారీచేసింది. అప్పట్లో ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్డింగ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ 2016లో ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ దాఖలు చేసిన పిల్‌ సోమవారం హైకోర్టు ఎదుట మరోమారు విచారణకు వ చ్చింది. బీఆర్‌ఎస్‌ స్థితిగతులపై వివరాలు కోరుతూ విచారణను అక్టోబర్‌ 9కి వాయిదా వేసింది.


logo