సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 21, 2020 , 21:56:54

ఒకరితో ప్రేమ.. మరొకరితో పెండ్లి

ఒకరితో ప్రేమ.. మరొకరితో పెండ్లి

రామగిరి: ఒకరితో ప్రేమాయణం నడిపి మరో యువతితో పెండ్లికి సిద్ధమై, మరో గంటలో పెండ్లి పీటలెక్కి తాళికట్టాల్సిన యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రామగిరి పీఎస్‌ ఎస్‌ఐ ఆర్కుటి మహేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీలోని సీటూ క్వార్టర్‌ ఏరియాలో నివసించే నాగెల్లి వరుణ్‌కుమార్‌ అనే యువకుడు నాలుగేళ్లుగా ఉద్యోగరీత్యా అమెరికాలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో మూడేళ్ల కింద హైదరాబాద్‌కు చెందిన యువతితో ఇంటర్నెట్‌లో పరిచయం కాగా, నిత్యం చాటింగ్‌ చేస్తూ ప్రేమాయణం నడిపాడు. స్వదేశానికి వచ్చినప్పుడల్లా తన ప్రియురాలిని కలుస్తుండేవాడు. అయితే నెల రోజుల కింద వరుణ్‌కుమార్‌ స్వదేశానికి రాగా, ఇంట్లో విషయం తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు సూర్యాపేట జిల్లాకు చెందిన మరో అమ్మాయితో వివాహం నిశ్చయించారు. వరుణ్‌ కుడా తన ప్రేమ సంగతి చెప్పకపోవడంతో ఈ నెల 21న పెళ్లి కుదిర్చారు. 

 వరుణ్‌ మరో యువతితో వివాహం చేసుకుంటున్నాడని తెలుసుకొని ప్రియురాలు కంగుతిన్నది. తాను మోసపోయానని గుర్తించి హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన అక్కడి పోలీస్‌ అధికారులు రామగిరి ఠాణాకు సమాచారం ఇచ్చారు. వెంటనే వెళ్లి పెండ్లి ఆపాలని ఆదేశించారు. ఈ క్రమంలో రామగిరి పోలీసులు రంగంలోకి దిగి, ఇంటి నుంచి సెంటినరీకాలనీలో సాయిరాం గార్డెన్‌లోని నిర్ణయించిన పెండ్లి మండపానికి వస్తున్న వరుణ్‌ను అదుపులోకి తీసుకొని మంథని ఠాణాకు తరలించారు. అనంతరం అక్కడి వచ్చిన ముషీరాబాద్‌ పోలీసులకు అప్పగించారు. 

 కాగా, మరో గంటలో వివాహ తంతు ముగుస్తుందనుకుంటున్న సమయంలో పోలీసులు వచ్చి వరుణ్‌ను తీసుకెళ్లడంతో బంధు, మిత్రులంతా అవాక్కయ్యారు. కొద్ది సేపటి దాకా ఏం జరుగుతున్నదో తెలియక బిత్తరపోయారు. తర్వాత విషయం తెలుసుకొని చడీచప్పుడు కాకుండా వెనుదిరిగారు. ఈ ఘటన కార్మిక క్షేత్రంలో చర్చనీయాంశంగా మారింది. కాగా, పెండ్లి అర్ధంతరంగా నిలిచిపోవడంతో ఎలాంటి గొడవలు జరగకకుండా కల్యాణ మండపం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.  logo