బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 02:22:10

రెండోటెస్టూ నెగెటివే

రెండోటెస్టూ నెగెటివే
  • గాంధీలో కోలుకున్న కొవిడ్‌ బాధితుడు
  • మూడు వైరాలజీ ల్యాబ్‌లకు అనుమతి
  • వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దుబాయ్‌లో కరోనా వైరస్‌ బారిన పడిన హైదరాబాద్‌ యువకుడు గాంధీ దవాఖానలో కోలుకున్నాడని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. రెండో పరీక్ష కూడా నెగిటివ్‌ వచ్చిందని, అతడిని త్వరలోనే డిశ్చార్జ్‌ చేస్తామని తెలిపారు. బుధవారంనాటికి రాష్ట్రంలో ఒక్క కరోనా పాజిటివ్‌ పేషెంట్‌ లేరని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇది శుభవార్తగా మంత్రి అభివర్ణించారు. కరోనా వస్తే మరణమే అంటూ.. బాధ్యతలేని కొందరు సోషల్‌ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారం నమ్మొద్దని సూచించారు. కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో కరోనా వైరస్‌ నియంత్రణ కమిటీతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విదేశాల నుంచి వస్తున్న వారందరికీ 24 గంటలపాటు శంషాబాద్‌ విమానాశ్రయంలో థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్నామని, అనుమానిత లక్షణాలున్న వ్యక్తులను నేరుగా దవాఖానలకు తరలిస్తున్నామని తెలిపారు. ఉస్మానియాలో నిర్ధారణ పరీక్షలకు కేంద్రం అనుమతించడంతో బుధవారం నుంచి ట్రయల్స్‌ ప్రారంభించినట్టు చెప్పారు. వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాల, నారాయణగూడ ఐపీఎం, ఫీవర్‌ దవాఖానలో నిర్ధారణ పరీక్షలకు కావాల్సిన పరికరాలు సిద్ధంచేస్తున్నామని తెలిపారు. కొవిడ్‌ను నిరోధించడంలో సమర్థంగా పనిచేస్తున్న తెలంగాణకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కిందన్నారు. గాంధీ, ఫీవర్‌ దవాఖానల్లో హెఫాఫిల్టర్లను ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు. 


16 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు

అనుమానిత లక్షణాలున్న 16 మందికి బుధవారం పరీక్షలుచేసినట్టు వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది. ‘ఇప్పటివరకు 302 మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలుచేయగా.. 292 మందికి వ్యాధి లక్షణాలు లేవని తేలింది. మరో 10 మంది నివేదికలు రావాల్సి ఉన్నది. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇప్పటివరకు 50,679 మందికి థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలుచేశాం’ అని పేర్కొన్నది.


ఏపీలో తొలి కరోనా కేసు

ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా కేసు నమోదైంది. ఇటలీనుంచి వచ్చిన ఓ యువకుడికి కరోనా వైరస్‌ సోకినట్టు వైద్యులు గుర్తించారు. జ్వరంతో బాధపడుతూ నాలుగురోజులుగా నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. రక్త నమూనాలను పరీక్షించి కొవిడ్‌-19 ఉన్నట్టు గుర్తించారు.


logo
>>>>>>