శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 00:57:47

108 ఉద్యోగుల పనితీరు భేష్‌

108 ఉద్యోగుల పనితీరు భేష్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా విజృంభిస్తున్న సమయంలో 108 ఉద్యోగులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బాగా పనిచేశారని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అభినందించారు. ఉద్యోగుల సమస్యలను క్యాబినెట్‌ సబ్‌కమిటీ దృష్టికి తీసుకెళ్తామని, వాటిని పరిష్కరించేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో 108 ఉద్యోగుల రెండో మహాసభకు ఈటల ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. తక్కువకాలంలోనే ఎక్కువ ఫలితాలు సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నదని తెలిపారు. ప్రజలంతా బాగుంటేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని, అందుకే వైద్యశాఖను మరింత బలోపేతం చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేశారని చెప్పారు. 

కార్పొరేట్‌ హాస్పిటల్స్‌కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్యసేవలు అందేలా ప్రభుత్వం కృషిచేస్తున్నదని పేర్కొన్నారు. కరోనాపై పోరులో వైద్యారోగ్యశాఖ సిబ్బంది కంటి మీద కునుకులేకుండా పనిచేశారని అభినందించారు. రాష్ట్రంలో 2.4 లక్షల అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాలు పెంచామని పేర్కొన్నారు. కేసీఆర్‌ కిట్‌ వచ్చాక ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయని, కల్యాణలక్ష్మి తెచ్చాక బాల్య వివాహాలు తగ్గాయని, బాలింతల మరణాలను కూడా తగ్గించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్‌, టీఆర్‌ఎస్కేవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ, 108 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాలాజీనాయక్‌, సహాయ కార్యదర్శి లక్ష్మణ్‌రావు, నాయకులు కరుణాకర్‌, శివశంకర్‌, కృష్ణమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.