ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 14, 2020 , 04:58:59

హరితహారం అడవికి వరం

హరితహారం అడవికి వరం

  • ఫలితమిస్తున్న మొక్కల పెంపకం
  • రాష్ట్రంలో పెరిగిన అడవుల శాతం 
  • 24 నుంచి 28శాతానికి పెరుగుదల
  • ఇప్పటివరకు నాటినవి 176.52 కోట్లు
  • సర్కారు లక్ష్యం 33 శాతం అడవులు

అంతరించిపోయిన అడవుల విస్థీర్ణం పెంపునకు ప్రభుత్వం యజ్ఞనంలా చేపట్టిన తెలంగాణకు హరితహారం సత్ఫలితాలను ఇస్తున్నది. పర్యావరణ సమతుల్యతకు, పచ్చదనం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం 2015లో హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఏటా కోట్లాది మొక్కలను నాటుతూ సంరక్షిస్తున్నది. 24 శాతంగా ఉన్న అటవీ విస్థీర్ణాన్ని 33 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకోగా, గత ఐదు విడుతల్లో చేపట్టిన హరితహారంతో అటవీ విస్థీర్ణం ఏకంగా 4 శాతం పెరిగింది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెంపునకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం అడవికి వరంలా మారింది. ఏటా కోట్లల్లో మొక్కలు నాటుతుండటంతో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. హరితహారానికి ముందు రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 24 శాతం ఉండేది. ఈ కార్యక్రమం చేపట్టిన ఐదేండ్ల వ్యవధిలోనే ఏకంగా అటవీ విస్తీర్ణం 4శాతం పెరిగి 28శాతానికి చేరుకున్నది. ఈ విషయాన్ని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియానే స్వయంగా ప్రకటించింది. మరో 5 శాతం పెరిగితే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 33శాతం అడవుల విస్తీర్ణం లక్ష్యం నెరవేరనున్నది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 176.52 కోట్ల మొక్కలు నాటగా, ఇందులో గడిచిన ఐదు విడుతలలో 151.76 కోట్ల మొక్కలు నాటారు. ఆరో విడుతలో ఇప్పటివరకు 24.74 కోట్ల మొక్కలు నాటగా, మరో 6 కోట్ల మొక్కలను నాటాల్సి ఉన్నది.

సంరక్షణ బాధ్యత కూడా..

తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందో అదేస్థాయిలో నిర్వహణ కూడా చేపట్టింది. ఈ కార్యక్రమంలో అన్నిశాఖలను భాగస్వామ్యంచేసింది. ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. ఇందుకు అవసరమైన నిధులను సమకూర్చింది. యజ్ఞంలా చేపట్టిన హరితహారం కార్యక్రమ లక్ష్యానికి అనుగుణంగా అవసరమైన మొక్కల కోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్దసంఖ్యలో నర్సరీల ఏర్పాటును ప్రొత్సహించింది. ఐదు విడుతలలో వివిధ నర్సరీలలో 185 కోట్ల మొక్కలను పెంచడం గమనార్హం. మొక్కలను నాటడమే కాకుండా, వాటి సంరక్షణ బాధ్యతను కూడా అధికారులకు అప్పగించింది. ప్రతి గ్రామంలో మొక్కలకు నీరు పోసేందుకు ప్రత్యేక చర్యలుచేపట్టింది.

2015-16లో నాటిన మొక్కలు
15.86 కోట్లు
2016-17లో నాటిన మొక్కలు
31.67 కోట్లు
2017-18లో నాటిన మొక్కలు
34.07 కోట్లు
2018-19లో నాటిన మొక్కలు  
32  కోట్లు
2019-20లో నాటిన మొక్కలు    
38.18 కోట్లు
2020-21లో నాటిన మొక్కలు
24.74 కోట్లు
ఇప్పటివరకు నాటిన మొత్తం మొక్కలు 
176.52 కోట్లు


logo