బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 02:45:59

రోజూ వెయ్యి మంది డిశ్చార్జి

రోజూ వెయ్యి మంది డిశ్చార్జి

  • హోం ఐసొలేషన్‌లో 12 వేల మంది
  • కేసులు మరింతగా పెరిగే అవకాశం
  • డీపీహెచ్‌ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశంలో ఢిల్లీ తర్వాత అత్యధికులు హోంఐసొలేషన్‌లో ఉన్నది తెలంగాణలోనేనని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ జీ శ్రీనివాసరావు తెలిపారు. ఇంట్లోనే ఉంటూ వైద్యుల సూచనలు పాటి స్తూ ఎంతోమంది కరోనా నుంచి కోలుకుంటున్నారని చెప్పారు. శనివారం కోఠిలోని కరోనా కమాండ్‌కంట్రోల్‌ సెంటర్‌లో వైద్యవిద్య డైరెక్టర్‌ రమేశ్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. గత నెల నుంచి 12వేల మంది హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్సపొందారని, ప్రస్తు తం 6,752 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారని వివరించారు. అవసరమైనవారికి టెలిమెడిసిన్‌, వీడియోకాల్‌ ద్వారా వైద్యసేవ లు అందిస్తున్నామని పేర్కొన్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, అవసరమైతే దవాఖానలకు తరలిస్తున్నామని తెలిపారు. చికిత్స అనంతరం కోలుకున్నవారు రోజుకు వెయ్యి మందివరకు డిశ్చార్జి అవుతున్నారని చెప్పారు.  అవసరమైనవారు 104కు, 108కు కాల్‌చేయవచ్చని తెలిపారు. 

పాజిటివ్‌ ఉంటేనే గాంధీకి

లక్షణాలు ఉన్నా, పాజిటివ్‌ అని తేలినా ఎక్కడికి వెళ్లాలనే దానిపై స్పష్టత ఉండాలని డీపీహెచ్‌ శ్రీనివాసరావు పేర్కొన్నారు. పాజిటివ్‌ ఉంటే గాంధీకి వెళ్లాలని, వీరు పరీక్షించి హోంఐసొలేషన్‌కు పంపిస్తారన్నారు. కేవలం శ్వాస సమస్యలుంటే ఉస్మానియాకు, కరోనా లక్షణాలకు తోడు ఊపిరితిత్తుల సమస్యలుంటే కింగ్‌కోఠి దవాఖానకు వెళ్లాలని సూచించారు. గాంధీలో 665 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని, టిమ్స్‌లోనూ మెజారిటీ పోస్టులు భర్తీ అయ్యాయని తెలిపారు. వచ్చేవారం టిమ్స్‌ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.


logo