e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home తెలంగాణ ముందున్నది మూడో ముప్పు!

ముందున్నది మూడో ముప్పు!

ముందున్నది మూడో ముప్పు!
  • కొవిడ్‌ జాగ్రత్తలు పాటించటంలో ప్రజల అలసత్వం
  • కేసులు తగ్గినా కరోనా పోలేదంటున్న నిపుణులు
  • ఇతర దేశాల అనుభవాలు మరువొద్దని హెచ్చరిక

ఇంకెక్కడి కరోనా.. అయిపాయే.. మాస్కు పెట్టుకొనుడు వద్దు, శానిటైజర్‌ రాసుకొనుడు వద్దు, భౌతిక దూరం అసలే వద్దు..ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ప్రజల్లో ఇదే ఆలోచనాధోరణి. వైరస్‌ వ్యాప్తి ఇంకా తగ్గలేదు, కొవిడ్‌ నిబంధనలు పాటించండి అని ప్రభుత్వం మొత్తుకొంటున్నా ప్రజలు మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. మొదటి వేవ్‌ తర్వాత ఇలాగే అలసత్వం ప్రదర్శించి రెండో వేవ్‌ను కొనితెచ్చుకొన్నాం. ఆ పర్యవసానం ఏపాటిదో అందరికీ తెలిసిందే. మన నిర్లక్ష్యధోరణితో మూడో వేవ్‌ గనుక వస్తే…? పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతుంది. ముందుజాగ్రత్తగా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకొందాం.

కరోనా కేసులు మాత్రమే తగ్గాయని, వైరస్‌ తీవ్రత తగ్గలేదని, అది ఏ క్షణమైనా విజృంభించే అవకాశం లేకపోలేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదటి, రెండో వేవ్‌ కరోనా వల్ల భారీ ప్రాణనష్టం జరిగింది. కుటుంబసభ్యులను కోల్పోయిన వేదన నుంచి ఇప్పటికీ కోలుకోలేనివారున్నారు. మరెందరో రోడ్డునపడ్డారు. మన రాష్ట్రంలో జూన్‌ నుంచి కరోనా కొత్త కేసుల్లో తగ్గుదల నమోదైంది. దాదాపు మూడు నెలల పాటు తీవ్ర నష్టం కలిగించిన కరోనా వైరస్‌ ఇప్పుడు పూర్తిస్థాయి అదుపులోకి వచ్చింది. మొదటి వేవ్‌ సమయంలో ఇలాగే కేసులు తగ్గుముఖం పట్టిన 3 నెలల్లోనే రెండోవేవ్‌ విజృంభించింది. మార్చి-మే మధ్యలో మొదటి వేవ్‌ కంటే మరింత బలంగా వైరస్‌ దాడి చేసింది. ఇప్పటికి రెండో వేవ్‌ ముగిసినా, మూడోవేవ్‌ ప్రమాదం పొంచి ఉన్నదని నిపుణులు చెప్తున్నారు. కేరళలో ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయని ప్రస్తుతం అక్కడ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని అంటున్నారు.

సర్కారు సిద్ధంగా ఉన్నా..

- Advertisement -

మూడో వేవ్‌ రూపంలో వైరస్‌ విజృంభిస్తే ఎదుర్కొనేందుకు రాష్ట్రప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉన్నది. 51 వేల పడకలను సిద్ధం చేసి, ఆక్సిజన్‌, మందుల కొరత రాకుండా చర్యలు తీసుకున్నది. మూడోవేవ్‌ వల్ల చిన్నారులకు ప్రమాదం పొంచి ఉన్నదన్న అంచనాల నడుమ ప్రత్యేకంగా 20 వేల పడకలను సిద్ధం చేసింది. ప్రభుత్వం ఎంత సిద్ధంగా ఉన్నా ప్రజల నుంచి సహకారం లేకుంటే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవటం సాధ్యం కాదని అధికారులు చెప్తున్నారు.

ఆరు నెలల కాలంలో వేవ్‌

ఒక వేవ్‌కు, మరో వేవ్‌కు మధ్య కనీసం 3-6 నెలల వ్యవధి ఉంటున్నదని ఎపిడమాలజిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా ఉద్ధృతిని పరిశీలిస్తే రెండో వేవ్‌కు, మూడో వేవ్‌కు సగటున ఆరునెలల వ్యవధి ఉన్నట్టు చెప్తున్నారు. యూకే, రష్యా, ఫ్రాన్స్‌, ఇటలీ, జర్మనీ, బంగ్లాదేశ్‌ తదితర దేశాలు ఇదే తీరుగా మూడోవేవ్‌ను ఎదుర్కొన్నాయి. ఇప్పుడు భార త్‌, అమెరికా, బ్రెజిల్‌ వంటి దేశాలు రెండో వేవ్‌కు ఆరు నెలల వ్యవధితో మూడో వేవ్‌ను ఎదుర్కొనే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఒడిశా, కేరళ, ఏపీ సహా కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నాలుగు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకొంటున్న తెలంగాణ మూడోవేవ్‌ను ఎదుర్కొనే విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

కోటి 25 లక్షల టీకాలు పూర్తి

రాష్ట్రంలో సోమవారంనాటికి కోటి 25 లక్షల మందికి కొవిడ్‌ నివారణ టీకాలు వేసినట్టు వైద్యారోగ్యశాఖ మంగళవారం విడుదలచేసిన బులెటిన్‌లో తెలిపింది. సోమవారం 1000 కేంద్రాల్లో 1.94 లక్షల టీకాలు వేసినట్టు పేర్కొన్నది. ప్రభుత్వ కేంద్రాల్లో 1.58 లక్షలు, ప్రైవేటులో 35 వేల మంది టీకాలు వేసుకున్నట్టు వెల్లడించింది. 18 ఏండ్ల పైబడిన ప్రతిఒక్కరికి వ్యాక్సిన్‌ వేసే ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతున్నదని, జీహెచ్‌ఎంసీ పరిధిలో 100 కేంద్రాలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణాల్లోని 204 ప్రభుత్వ కేంద్రాల్లో, 636 పీహెచ్‌సీల్లో వ్యాక్సిన్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతున్నదని వివరించింది. రాష్ట్రంలో వ్యాక్సిన్‌ వృథా కేవలం 3.42 శాతంగా ఉన్నట్లు తెలిపింది.

కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలు

  • భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ,
  • పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్‌ అర్బన్‌, కరీంనగర్‌

రెండో దశ నుంచి బయటపడ్డాం

కరోనా రెండో దశ నుంచి బయటపడ్డాం కానీ మూడో దశ ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు కొవిడ్‌ జాగ్రత్తలను కచ్చితంగా పాటించాలి. కేసులు తగ్గినా ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించటం
మరచిపోవద్దు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం.-
శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు

ముందున్నది మూడో ముప్పు!
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముందున్నది మూడో ముప్పు!
ముందున్నది మూడో ముప్పు!
ముందున్నది మూడో ముప్పు!

ట్రెండింగ్‌

Advertisement