సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 03:32:56

నాలుకలు చీరేస్తరు

నాలుకలు చీరేస్తరు

  • సొంతగడ్డకు ద్రోహమే కాంగ్రెస్‌ విధానం
  • బీజేపీపైనా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఫైర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కాంగ్రెస్‌ నాయకులు.. హైదరాబాద్‌లో సెక్షన్‌-8 అన్న పేరెత్తితే ప్రజలు వారి నాలుకలు చీరేస్త్తారని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు. హైదరాబాద్‌ మీద మరోసారి ఇతర ప్రాంత నాయకులు పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని, ఇక్కడ వారి కుట్రలు పనిచేయవని అన్నారు. బుధవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ నాయకులు ఏనాడూ తెలంగాణ రాష్ర్టాన్ని కోరుకోలేదని, ఒకరు రాయల్‌ తెలంగాణ అని, మరొకరు హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతమని రకరకాలుగా మాట్లాడారని గుర్తుచేశారు. ఉత్తమ్‌ ఏనాడూ తెలంగాణ గురించి మాట్లాడలేదని, రాష్ట్ర సాధనలో ఇక్కడి కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల పాత్ర ఏమీ లేదని విమర్శించారు. తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్ష చూసి ఆ రెండు పార్టీల జాతీయ నాయకత్వం ప్రత్యేక రాష్ట్ర సాధనకు మద్దతు తెలిపిందని చెప్పారు.

తెలంగాణ సాధనలో వారు లేనందునే ఇక్కడి ప్రజల మద్దతు లేదని పేర్కొన్నారు. తెలంగాణలో బ్లాక్‌ డే కాదని, గోల్డెన్‌ డేస్‌ నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని ప్రజలు బలపర్చారని చెప్పారు. సచివాలయం నిర్మాణం వద్దనేవారు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టే అన్నారు. బీజేపీ నాయకులకు దిమాక్‌ ఖరాబైందని మంత్రి విమర్శించారు.  రాష్ట్ర ప్రజల అవసరాలు తీరేలా సీఎం కేసీఆర్‌ పాలిస్తున్నారని, మరో 20 ఏండ్ల వరకు టీఆర్‌ఎస్‌ పాలనే ఉంటుందని ఉద్ఘాటించారు.  


logo