e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home Top Slides హడలెత్తిస్తున్న బ్లాక్‌ ఫంగస్‌

హడలెత్తిస్తున్న బ్లాక్‌ ఫంగస్‌

హడలెత్తిస్తున్న బ్లాక్‌ ఫంగస్‌
  • కాస్త అజాగ్రత్త ప్రాణాంతకం కావచ్చు
  • అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ): దేశంలో ఓవైపు కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండగా.. తాజాగా బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి హడలెత్తిస్తున్నది. వ్యాధి బారినపడినవారు తిరిగి మామూలు స్థితికి వచ్చిన దాఖలాలు చాలా అరుదు. ఇటీవల ఢిల్లీలో ఒకరికి దవడను తీసివేయగా, మరొకరికి కన్ను తీసేశారు. ఈ వ్యాధికి గురైనవారు ఏమాత్రం ఏమరుపాటుచూపినా మృత్యువాత పడటం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక రోగులు, క్యాన్సర్‌కు కీమోథెరపీ తీసుకుంటున్నవారు, మధుమేహం నియంత్రణలో లేని రోగులు, అవయవమార్పిడి చేసుకున్నవారు, తీవ్ర గాయాలపాలైనవారికి బ్లాక్‌ ఫంగస్‌ సోకే అవకాశముందని వైద్య నిపుణులు తెలిపారు. ఆరోగ్యవంతులైన వారి నోటిలో, శ్వాసనాళాల వద్ద ఈ ఫంగస్‌ ఉన్నప్పటికీ వారిలోని చెక్కుచెదరని రోగ నిరోధక వ్యవస్థ కారణంగా అది ఇన్‌ఫెక్షన్‌గా మారడం లేదని పేర్కొన్నారు.

కారణమిదే..

కరోనా కారణంగా శరీరంలో తెల్ల రక్తకణాల స్థాయి తగ్గుతుంది. అంటువ్యాధులపై పోరాటంలో తెల్ల రక్తకణాలు శరీరంలో తొలి రక్షణ కవచాలుగా కీలకపాత్ర పోషిస్తాయి. వీటి సంఖ్య తగ్గడంతోనే శరీరంపై ఫంగస్‌, బ్యాక్టీరియా, వైరస్‌ల దాడి పెరుగుతుంది. ప్రస్తుతం కొవిడ్‌తో ఐసీయూలో చికిత్స అందిస్తున్న వారికి స్టెరాయిడ్స్‌ ఇస్తున్నారు. ఇమ్యునోమాడ్యులేటర్స్‌గా పనిచేసే కొన్ని రకాల డ్రగ్స్‌ను ఇస్తున్నారు. ఇవి శరీరంలోని సహజ రక్షణ వ్యవస్థను దెబ్బతీస్తాయి. ముఖ్యంగా తెల్ల రక్తకణాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఈ నేపథ్యంలోనే సదరు రోగులు బ్లాక్‌ఫంగస్‌ బారిన పడే అవకాశాలు పెరుగుతున్నాయి.

దీని లక్షణాలు ఇవి..

బ్లాక్‌ ఫంగస్‌ కారణంగా ముఖంలోని ఏదైనా ఒక భాగంలో నొప్పి మొదలవుతుంది. ముక్కు, కండ్ల చుట్టూ ఎర్రగా మారి వాపు వస్తుంది. ఫలితంగా కనురెప్పలు వాలిపోవడం, కండ్లు అసాధారణంగా ఉబ్బడం, కనుగుడ్ల కదలికలు తగ్గడం జరుగుతాయి. జ్వరంతోపాటు తలనొప్పి, దగ్గు మొదలవుతుంది. అంగిలిపై నల్లటి మరకలు ఏర్పడుతాయి. దంతాలలో నొప్పి వస్తుంది. రక్త వాంతులు రావొచ్చు. మానసిక సంతులన దెబ్బతింటుంది. ఈ ఫంగస్‌ మెదడులో చేరితే మరణం తప్పదని ఢిల్లీకి చెందిన డాక్టర్‌ లహానే చెప్పారు.

అందుబాటులో ఉన్న చికిత్స..

బ్లాక్‌ ఫంగస్‌ తీవ్రమైన అనారోగ్యానికి గురిచేయడమే గాకుండా, ప్రాణాలను సైతం తీస్తుంది. రక్తపరీక్షలు, నాజల్‌ స్వాబ్స్‌, ఎంఆర్‌ఐ స్కాన్‌ ద్వారా బ్లాక్‌ ఫంగస్‌ ఉనికిని నిర్ధారించవచ్చు. తొలిదశ, స్థానిక ఇన్‌ఫెక్షన్స్‌ను ఇంట్రావీనస్‌, లోకల్‌ యాంటీ ఫంగల్‌ ఇంజెక్షన్స్‌ అందించడం ద్వారా చికిత్సనందించి అనంతరం సుదీర్ఘకాలంపాటు నోటి ద్వారా తీసుకునే యాంటీ ఫంగల్‌ ఔషధాలు అందిస్తారు. కొన్నిసార్లు మరణాలను నివారించేందుకు శస్త్రచికిత్స అవసరమవుతుంది. ఈ క్రమంలో కనుగుడ్లను, దవడ ఎముకలను తొలగించిన ఘటనలు ఉన్నాయి.

నిర్లక్ష్యం చేయవద్దు

ఈ లక్షణాలతో ఎవరు బాధపడినా కంటి చికిత్స నిపుణులను, ఆక్యులోప్లాస్టీ స్పెషలిస్ట్‌ను సంప్రదించాలి. లేదా ఈఎన్‌టీ సర్జన్‌ను సంప్రదించవచ్చు. బ్లాక్‌ ఫంగస్‌ బారినపడే అవకాశాలను తగ్గించుకునేందుకు, రోగులు తమకు చికిత్సనందిస్తున్న ఫిజీషియన్లను సంప్రదించడంతోపాటు బ్లడ్‌ షుగర్‌ను నియంత్రించుకునేందుకు ప్రయత్నించాలి. డయాబెటిస్‌, బీపీ ఉన్న రోగులు కొవిడ్‌ బారిన పడితే స్టెరాయిడ్స్‌ను అవసరమైన మేరకే వాడాలి. అధిక పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడంతోపాటు, ఒత్తిడిని దరిచేరనీయకూడదు. అలా చేస్తే బ్లాక్‌ ఫంగస్‌బారిన పడే ముప్పును గణనీయంగా తగ్గించవచ్చు.
-తర్జానీ వివేక్‌దవే, సీనియర్‌ ఆప్తమాలజిస్ట్‌, ఎల్‌వీ ప్రసాద్‌, కంటి దవాఖాన

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హడలెత్తిస్తున్న బ్లాక్‌ ఫంగస్‌

ట్రెండింగ్‌

Advertisement