సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 20:21:38

ప్రజలు బాధ్యతతో సహకరించాలి: మంత్రి ప్రశాంత్ రెడ్డి

ప్రజలు బాధ్యతతో సహకరించాలి: మంత్రి ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసారు. స్వీయ నియంత్రనే శ్రీరామ రక్ష అని, కలిసికట్టుగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికడదామని, ప్రజలు బాధ్యతతో సహకరించాలని ఆయన కోరారు. ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు ప్రజలు నడుచుకోవాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ మెసేజ్ లను ప్రజలు నమ్మొద్దని,ప్రభుత్వ అధికారిక ప్రకటనలనే విశ్వసించండని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కూరగాయల, నిత్యావసర మార్కెట్లు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటాయని,ప్రజలు గుంపులు గుంపులుగా వెళ్లకూడదని సూచించారు. ఇంటి నుంచి ఒక్కరే బయటకు రావాలని, తప్పనిసరిగా మాస్క్ లు ధరించి వెళ్లాలని తెలిపారు.

కరోనా వైరస్ నివారణకు నియంత్రణ ఒక్కటే మార్గమన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చే బియ్యం, నగదును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రతి తెల్ల కార్డు లబ్ధిదారులకు ఒక్కరికి 12 కిలోల చొప్పున నెలకు సరిపడా బియ్యం తో పాటు 1500 వందల రూపాయల నగదు ప్రభుత్వం అందించనుందని తెలిపారు.నిర్లక్ష్య ధోరణే వైరస్ వ్యాప్తికి కారకం అవుతుందని,అభివృద్ది చెందిన దేశాలే వైరస్ ధాటికి విలవిలలాడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.దూరదృష్టితో ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ ప్రకటించారని,సామాజిక బాధ్యతతో ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేసారు.జిల్లా పరిధిలోని అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని,జ్వరం,జలుబు,దగ్గు ఉన్నవారు వెంటనే 104 ను సంప్రదించాలని తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువులు అధిక ధరకు అమ్మిన,కృత్రిమ కొరత సృష్టించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.వినియోగదారులు 100 కు ఫోన్ చేసి పిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో వ్యాపారులు కూడా సహకరించాలని కోరారు.


logo