బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 12:47:00

ప్రభుత్వ నిర్ణయానికి ప్రజలు సహకరించాలి: ఖమ్మం కలెక్టర్‌

ప్రభుత్వ నిర్ణయానికి ప్రజలు సహకరించాలి: ఖమ్మం కలెక్టర్‌

ఖమ్మం: దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ తెలిపారు. మన ఆరోగ్యం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని కలెక్టర్‌ ప్రజలకు సూచించారు. ప్రస్తుతం కొంత ఇబ్బంది అనిపించినా.. కరోనా వ్యాప్తి నిరోధానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. అత్యవసరమైతే గానీ బయటకు రాకూడదని తెలిపారు. రాష్ట్రంలో ప్రమాద పరిస్థితులు ఏమి లేవని, ముందస్తు చర్యగా మెడికల్‌ షాపులు, ఆస్పత్రులు, బ్యాంకులు, విద్యుత్‌ సిబ్బంది అందుబాటులో ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు. కిరాణషాపులు, కూరగాయల మార్కెట్‌, మాంసాహార దుకాణాలు కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. 

ఏదైనా సమస్య వస్తే టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1077 అందుబాటులో ఉంచామని కలెక్టర్‌ వివరించారు. యువత నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వస్తే, వాహనాలు సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తెల్లరేషన్‌ కార్డుదారులకు 12 కిలోల బియ్యంతో పాటు 1500 రూపాయల నగదును ఉచితంగా అందించనున్నది. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు తమ సొంత బాధ్యతగా స్వీకరించి, స్వీయనిర్బంధం పాటించాలన్నారు. సామాజిక దూరం పాటించాలనీ, జనం సమూహాలుగా ఏర్పడకూడదని వారు ప్రజలకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో పాటు పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌, ప్రభుత్వ అధికారులు ఉన్నారు.


logo