ప్రకృతి అందాలను చూసొస్తాం!

- పర్యటనలకు సిద్ధమవుతున్న ప్రజలు
- పరిశుభ్రత, భద్రతపై 93% మంది దృష్టి
- థామస్కుక్ ఇండియా, ఎస్వోటీసీ సర్వేలో వెల్లడి
ఏమైంది పుట్టు వెంట్రుకలు తీయించలేదు..? మొక్కు తీర్చుకునేందుకు గుడికి వెళ్లలేదా? ఈ ఏడాది లాంగ్ టూర్కు పోలేదా?.. ఇలా ఎన్నో ప్రశ్నలకు ‘కొవిడ్-19’ ఒకటే సమాధానం. ప్రయాణాలు దేవుడెరుగు అసలు ఇంటినుంచి అడుగు బయట పెట్టేందుకూ భయపడ్డారు. ఇప్పుడిప్పుడే ప్రజలు మళ్లీ ప్రయాణాలకు సై అంటున్నారని ప్రముఖ ట్రావెల్ సర్వీసెస్ సంస్థలు థామస్ కుక్ ఇండియా, ఎస్వోటీసీ సంయుక్త సర్వే వెల్లడించింది.
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కరోనా కారణంగా రద్దు చేసుకున్న ప్రయాణాలను మళ్లీ చేపట్టేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. లాక్డౌన్కు ముందు రద్దయిన ప్రయాణాలను ఇప్పుడు పూర్తి చేసుకుంటామని 89 శాతం మంది అంటున్నట్టు థామస్ కుక్ ఇండియా, ఎస్వోటీసీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. ప్రయాణ సమయంలో ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని, అవసరమైతే ఇందుకోసం ఎంత ఖర్చయినా భరిస్తామని 73 శాతం మంది వెల్లడించారు. చలి కాలంలో చాలామంది కొండ ప్రాంతాల ప్రయాణానికి ఆసక్తి చూపిస్తున్నారు. వేకువజామునే కొండను కప్పేసే మంచు అందాలు చూడాలని కోరుకుంటున్నారు. వివిధ రాష్ర్టాల్లో లాక్డౌన్ తరువాత కొండ ప్రాంతాలకు వచ్చే దాదాపు 2000 మందితో మాట్లాడగా చాలామంది ఈ విషయాన్ని వెల్లడించారు. కొండ ప్రాంతాలను సందర్శించాలనుకునేవారిలో 50 శాతం మంది 18 నుంచి 25 సంవత్సరాల వయసువారే ఉన్నారు. మరో 37 శాతం మంది 26 నుంచి 30 ఏండ్లు, పదిశాతం మంది 31 సంవత్సరాల కంటే పెద్దవారు ఉన్నారు. లాక్డౌన్ తరువాత మొదట కొండ ప్రాంతాలకే వచ్చామని 59 శాతం మంది పేర్కొన్నారు.
రాష్ట్రంలో పెరిగిన తాకిడి
రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు తాకిడి పెరుగుతున్నది. లాక్డౌన్ తర్వాత నవంబర్, డిసెంబర్ నెలల్లో పర్యాటకుల రాక మొదలు కాగా, జనవరిలో ఇది మరింత పెరిగిందని పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. రెండు, మూడునెలల్లో పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనావేస్తున్నారు.