శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Apr 08, 2020 , 14:41:31

బంధువులున్నా.. బలగమున్నా.. పాడె మోసేందుకు మిగిలింది ఆ నలుగురే

బంధువులున్నా.. బలగమున్నా.. పాడె మోసేందుకు మిగిలింది ఆ నలుగురే

  • బంధువులున్నా.. బలగమున్నా.. పాడె మోసేందుకు మిగిలింది ఆ నలుగురే
  • అంత్యక్రియలకు పదిమందైనా రానిస్థితి
  • కరోనాతో ‘కాటికాడ’ మారిన పరిస్థితులు.. 
  • దింపుడు కల్లమూ లేదు చివరి బియ్యమూ లేవు
  • నేరుగా శ్మశానానికే వెళ్తున్న మృతదేహాలు
  • దుఃఖాన్ని దిగమింగి ఉత్తరక్రియల నిర్వహణ 
  • ఆపద సమయంలో ధైర్యం కోల్పోని జనం

హైదరాబాద్‌కు వంద కిలోమీటర్ల దూరంలోని ఒక గ్రామం. 85 సంవత్సరాల పండు ముదుసలి అనారోగ్యంతో కన్నుమూసింది. ఆ తల్లికి ఉత్తరక్రియలు నిర్వహించడానికి కన్నకొడుకు నగరం నుంచి నానా తిప్పలు పడుతూ ఊరికి చేరుకొన్నాడు. ఆ అమ్మను సాగనంపడానికి అతని నలుగురు కుటుంబ సభ్యులు తప్ప ఎవ్వరూ లేరు. రాలేదు. కనీసం పాడె కట్టి మోసేందుకు కూడా నలుగురంటే నలుగురు లేకుండాపోయారు. చివరకు తనే ఎలాగోలా ఒక ట్రాక్టర్‌ మాట్లాడుకొని శ్మశానానికి తీసుకెళ్లి అంతిమసంస్కారాలు కానిచ్చామనిపించుకొని ఇల్లు చేరుకొన్నాడు. ఎంత దయనీయమైన పరిస్థితి? ఆ మహాతల్లి తన జీవితకాలంలో పదులకొద్దీ పెండ్లిండ్లు చేసింది. చేతికి ఎముకలేకుండా దానంచేసింది. ఎంతో బలగం ఉన్నది. కానీ.. రెండు తెలుగు రాష్ర్టాల్లో లాక్‌డౌన్‌ కారణంగా అంతిమ ఘడియల్లో ఒక్కరు కూడా రాలేని పరిస్థితి. లోకంలోకి ఒంటరిగా వచ్చినా.. పోయేటప్పుడు నలుగురు మోసేవాళ్లు.. పదిమంది మునిగేవాళ్లు.. వందమంది సాగనంపేవాళ్లూ వెంట ఉండాలని పెద్దలంటారు. ఆమె వారందరినీ సంపాదించుకొన్నది. కానీ.. వెళ్లేటప్పుడు మాత్రం ఎవరూ కడచూపుకు నోచుకోకుండానే అనంతవాయువుల్లో కలిసిపోయింది. 

హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక అన్నట్టు ఇవాళ కరోనా కారణంగా ఎవరైనా చనిపోతే.. అంత్యక్రియలు జరుపడానికి మనుషులు లేని పరిస్థితి నెలకొన్నది. రోదనలు లేవు.. ఓదార్పులు లేవు.. పరామర్శలు లేవు..  బంధువులు లేరు.. పాడెమోసే నలుగురి కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. దవాఖానలో కన్నుమూస్తున్న కొందరికి ఇంటిముఖం కూడా లేదు. పేద, గొప్ప తేడా లేదు.. పేర్చిన చితిపైకి చేరడమే మహాగొప్ప అన్నట్టుగా మారింది నేటి పరిస్థితి. ఇక.. కర్మకాండలు, కాకి ముట్టడాలు కరోనా మహమ్మారిని కాటికి పంపాకేనేమో.

ఇల్లు కదలడంలేదు

కరోనా వైరస్‌ వ్యాప్తి ఒకవైపు, లాక్‌డౌన్‌ నిబంధనలు మరోవైపుతో దగ్గరి బంధువు లు, ఆప్తమిత్రులు మృతిచెందినా ఆఖరి చూపునకు కూడా నోచుకోవడం లేదు. అంతిమ సంస్కారాల వద్ద పదిమందికి మించి ఉండటం లేదు. ఎంతదగ్గరి వారైనా సరే.. ఫోన్‌లోనే పరామర్శలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ సీనియర్‌ జర్నలిస్టు తన తల్లి చనిపోయిన విషయాన్ని ఫేస్‌బుక్‌లోనే తెలిపి.. ఎవరూ రావద్దని కూడా కోరారు. 

శ్మశానంలోనూ కట్టడి చర్యలు

హైదరాబాద్‌లోని అంబర్‌పేట శ్మశానవాటికలో గతంలో మాదిరిగా రోజూ సగటున పది మృతదేహాలకు అంత్యక్రియలు జరుగుతున్నా బంధువులు, మిత్రులు మచ్చుకైనా కనిపించడంలేదు. ఒక్కో మృతదేహం వెంబడి ఐదారుగురికి మించి రావడంలేదు. రాయదుర్గంలో నిర్మించిన ‘మహా ప్రస్థానం’లో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. గతంలో వందలు, వేలలో వచ్చేవారిసంఖ్యను 15 నుంచి 20 మందికి పరిమితంచేశారు. మాస్కులు లేకుండా లోపలికి అనుమతించడం లేదు.

ధనాని భూమౌ పశవశ్చ కోష్ఠే నారీ గృహద్వారి జనః శ్మశానే దేహాశ్చితాయాం పరలోక మార్గే కర్మానుగో గచ్ఛతి జీవ ఏకః

చనిపోయినప్పుడు సంపాదించినదేదీ మనతోరాదు. పెంచుకున్న పశువులు  కొట్టంలోనే ఉండిపోతా యి. ప్రియమైన భార్య ఇంటి తలు పుచాటునే ఆగిపోతుంది. బంధుమిత్రులు శ్మశానం దాకా మాత్రమే వస్తారు. దేహమూ చితివరకే మాత్రమే వస్తుంది. ఇవేవీ మనకు చెందవు. మనంచేసే మంచి చెడ్డలే చివరికి మిగులుతాయి. 


పంచాయతీ ట్రాక్టర్‌లో 

నల్లగొండ జిల్లా తిప్పర్తికి సోమ వెంకటాచారి మంగళవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమారులున్నారు. ఆయన అంత్యక్రియలకు బంధువులే కాకుండా ఇరుగుపొరుగువారు కూడా రాలేదు. కరోనా కారణంగా పాడె పట్టేందుకు ఎవరూ ముందుకురాకపోవడంతో చివరకు సర్పంచ్‌ రమేశ్‌ గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌పై మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించారు. పాడెను కూడా ఇంటివాళ్లే సిద్ధం చేసుకున్నారు.

దహన సంస్కారాలు చేసిన కూతురు

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చినమడూరులో నల్లనాగుల సోమనాధం(60) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందాడు. మృతుడికి కుమారులు లేకపోవడంతో కూతురు వసుధ అంతిమ సంస్కారాలు నిర్వహించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో బంధువులు రాకపోవడంతో గ్రామపంచాయతీ సహకారంతో ట్రాక్టర్‌ సమకూర్చగా, నలుగురే దహనసంస్కారాలు నిర్వహించారు. 

ఆన్‌లైన్‌లోనే తల్లి అంత్యక్రియలు

గుండెపోటుతో మృతిచెందిన తల్లి అంత్యక్రియలను లండన్‌లో ఉండే కుమారుడు ఆన్‌లైన్‌లో చూడాల్సిన దీనస్థితి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడుకు చెందిన మంఖాల సావిత్రమ్మ (60) సోమవారం సాయంత్రం మృతిచెందింది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొంతకాలం క్రితం పెద్దకుమారుడు బ్రెయిన్‌ ట్యూమర్‌తో మరణించగా.. మరో కుమారుడు కరుణాకర్‌రెడ్డి లండన్‌లో స్థిరపడ్డాడు. తలకొరివి పెట్టాల్సిన కొడుకు లాక్‌డౌన్‌తో అక్కడినుంచి రాలేకపోవడంతో భర్త శేఖర్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. 

నానమ్మ చితికి మనుమడు నిప్పు 

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన లోకుర్తి లక్ష్మి (52) అనారోగ్యంతో మృతిచెందింది. ఆమె కుమారుల్లో రాజు సౌదీలో, శేఖర్‌ దుబాయిలో ఉంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వారు వచ్చే పరిస్థితి లేకపోవడంతో శేఖర్‌ కొడుకు హార్ధిక్‌తో లక్ష్మి అంత్యక్రియలు నిర్వహించారు.


logo