గురువారం 09 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 15:40:42

పట్టణ ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలి

పట్టణ ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలి

రంగారెడ్డి : గ్రామాలతో పాటు పట్టణాలను అభివృద్ధి చేయాలన్నదే  ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని నాదర్‌గుల్‌ 8వ వార్డులో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు, అల్మాస్‌గూడ జయశంకర్‌ కాలనీలో రూ. 47లక్షలతో డ్రైనేజీ పైపులైన్‌, నవయుగ కాలనీలో రూ.15 లక్షలతో డ్రైనేజీ, సాయినగర్‌ కాలనీలో రూ.30 లక్షలతో సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన అందించాలన్న లక్ష్యంతో  సీఎం కేసీఆర్  పనిచేస్తున్నారని ఆమె అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేశారో పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా కాలనీలను అభివృద్ధి చేస్తామన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో కాలనీ వాసులు భాగస్వాములు కావాలన్నారు. సీజనల్‌ వ్యాధులు రాకుండా జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో పారిశుధ్య  పనులు చేయడానికి కొత్తగా 105 మంది సిబ్బందిని తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని జనప్రియ మహానగర్‌లో నాబార్డు ఆధ్వర్యంలో మహిళలకు మగ్గం వర్క్‌ శిక్షణ కేంద్రాన్ని మంత్రి సబిత ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఇలాంటి ఉపాధి కార్యక్రమాలు ఎంతో దోహద పడుతాయన్నారు. మగ్గం వర్క్‌ నేర్చుకొని ఉపాధి పొందాలన్నారు. ప్రతి రొజు 20 మందికి శిక్షణ ఇస్తారని తెలిపారు.logo