ఆదివారం 17 జనవరి 2021
Telangana - Dec 25, 2020 , 13:14:04

యాప్‌ల విషయంలో జాగ్రత్త: సీపీ సజ్జనార్‌

యాప్‌ల విషయంలో జాగ్రత్త: సీపీ సజ్జనార్‌

హైదరాబాద్‌: యాప్‌ల విషయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ సూచించారు. మొబైల్‌ సందేశాల్లో వచ్చే లింక్‌లను ఓపెన్‌ చేయవద్దని కోరారు. యాప్‌ల ద్వారా మోసపోయినవారు ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడకూడదని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లోన్‌ యాప్‌ల కేసులో మరో ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. లోన్‌ యాప్‌ల ముఠాలో నలుగురు సభ్యులను నిన్న అరెస్టు చేశామని చెప్పారు. ఈ ముఠాలో కీలకపాత్ర పోషించిన చైనా వాసి పరారీలో ఉన్నారని వెల్లడిం చారు. స్థానికులతో కలిసి చైనావాసులు రెండు డిజిటల్‌ కంపెనీలను, కాల్‌సెంటర్లు ఏర్పాటుచేసి రుణాలు వసూలు చేశారని చెప్పారు. 

40 ఏండ్లలోపువారే లక్ష్యంగా..

ఈ కేసుతో సంబంధమున్న మరో చైనావాసి ఫిబ్రవరిలో వ్యాపార వీసాపై వచ్చి దందాలో పాల్గొన్నా డని వెల్లడించారు. ఎప్పటికప్పుడు కొత్త కేంద్రాలు ఏర్పాటుచేసి వ్యాపారాన్ని విస్తరించుకున్నారని చెప్పారు. మొత్తం 11 యాప్‌లు సృష్టించి రుణాలు ఇచ్చారని తెలిపారు. ప్రత్యేకంగా 40 ఏండ్ల లోపు ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని రుణాలిచ్చారన్నారు. రుణాలపై 25 నుంచి 30 శాతం వడ్డీ వసూలు చేసేవారని, ఒకవేళ రుణాల చెల్లింపులు ఆలస్యమైతే జరిమానా వసూలు చేసేవారని చెప్పారు. హైదరాబాద్ నుంచి దేశవ్యాప్తంగా కార్యకలాపాలు సాగించేవారని వెల్లడించారు. 

లక్షల్లో వినియోగదారులు

లోన్‌ యాప్‌లకు లక్షల్లో వినియోగదారులు ఉన్నారని, రుణాలు తీసుకున్నవారి నుంచి తిరిగి వసూలు చేసే బాధ్యత కాల్‌సెంటర్లదేనని చెప్పారు. యాప్‌లకు ఎన్‌బీఎఫ్‌సీలతో సంబంధం లేదని తెలిపారు. నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. చైనా, సింగపూర్‌, ఇతర దేశాల నుంచి నిధులు వచ్చాయా అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. లోన్‌ యాప్‌లే కాకుండా ఆటల యాప్‌ల్లోనూ మోసాలకు పాల్పడ్డారని చెప్పారు. యాప్‌ల దర్యాప్తులో రోజురోజుకూ కొత్త అంశాలు బయటకు వస్తున్నాయని చెప్పారు.

ఆన్‌లైన్ కాల్ మనీ కేసులో నలుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు చైనీస్‌తో పాటు మరో ఇద్దరు నిందితులు ఉన్నారు. వారి వద్ద ఉన్న రూ.2 కోట్లు నగదు, 2 లాప్ టాప్‌లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.  

ఇవి కూడా చదవండి..

జవహర్‌నగర్‌ ఘటనలో పలువురిపై హత్యాయత్నం కేసు

బండి సంజయ్‌కు నిరసనల సెగ

నేటి నుంచి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌