గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 00:39:31

కొత్తపేటలో రెవెన్యూమేళా

కొత్తపేటలో రెవెన్యూమేళా

  • సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
  • ఇటిక్యాల సమస్యల పరిష్కారానికి ఆరు బృందాలు 
  • అతిత్వరలో మూడు గ్రామాల అన్నదాతలకు రైతుబంధు

గజ్వేల్‌/గజ్వేల్‌ అర్బన్‌/జగదేవ్‌పూర్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం కొత్తపేటలో రెవెన్యూ మేళా నిర్వహించారు. భూములున్నా 60 ఏండ్లుగా ప్రభుత్వ పథకాలు వర్తించట్లేదని కొత్తపేట, ఇటిక్యాల, లింగారెడ్డిపల్లి రైతుల సమస్య సీఎం కేసీఆర్‌ దృష్టికి రాగా, శుక్రవారం సీఎం ఇటిక్యాల సర్పంచ్‌తో ఫోన్లో మాట్లాడారు. సమస్య పరిష్కరించి పది రోజుల్లో తానే రైతుబంధు డబ్బులిస్తానని చెప్పిన సీఎం.. వెంటనే అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఉదయమే సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డితోపాటు రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు జగదేవ్‌పూర్‌ మండలం కొత్తపేటకు చేరుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, అధికారులతో కలిసి సుదీర్ఘంగా చర్చించారు. రైతుల నుంచి భూముల పత్రాలను, సమస్యల పరిష్కారానికి దరఖాస్తులను స్వీకరించారు. రికార్డులను పరిశీలించిన కలెక్టర్‌ పన్నాలాల్‌ పట్టి పేరుతో 546 ఎకరాలు, ఇతర భూ సమస్యలతో 350 ఎకరాల రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామన్నారు. 2006లో అప్పటి ప్రభుత్వం వీటిని సీలింగ్‌ భూములుగా పేర్కొనడంతో అప్పటి నుంచి 14 ఏండ్లుగా క్రయవిక్రయాలకు కూడా నోచుకోలేదన్నారు. 

సమస్యల పరిష్కారానికిఆరు బృందాలు

కొత్తపేట, ఇటిక్యాల, లింగారెడ్డిపల్లి గ్రామాల్లోని భూ సమస్యల పరిష్కారానికి ఆరు బృందాలను ఏర్పాటుచేసినట్లు కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి పేర్కొన్నారు. 896 ఎకరాల భూముల సర్వే నంబర్లు తదితర అంశాలను పరిశీలించి, రెండ్రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, తాసిల్దార్లను ఆదేశించారు. 80 ఏండ్ల తమ భూ సమస్యలను పరిష్కరిస్తుండటంతో కొత్తపేట, ఇటిక్యాల, లింగారెడ్డిపల్లి గ్రామాల రైతులు సంబరపడుతున్నారు.

కొత్తపేట భూ సమస్యలపై సీఎం కేసీఆర్‌ ఆరా

  • త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌కు ఆదేశం
  • త్వరలోనే రైతులకు పట్టాల పంపిణీకి చర్యలు

గజ్వేల్‌ అర్బన్‌: కొత్తపేట భూ సమస్యలపై సీఎం కేసీఆర్‌ కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డికి ఫోన్‌ చేసి ఆరాతీశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు శనివారం కలెక్టర్‌ కొత్తపేటలో రెవెన్యూ మేళా నిర్వహించారు. అదేసమయంలో సీఎం కేసీఆర్‌ కలెక్టర్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. అలాగే జగదేవ్‌పూర్‌లో పల్లె ప్రగతి సమీక్ష నిర్వహిస్తుండగా మరోసారి సీఎం కేసీఆర్‌ కలెక్టర్‌కు ఫోన్‌ చేసి వివరాలను తెలుసుకున్నారు. కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి గ్రామంలో నిర్వహించిన మేళా గురించి రైతుల సమస్యల పరిష్కారానికి చేపడుతున్న చర్యల గురించి సీఎంకు వివరించారు. సాధ్యమైనంత తొందరగా భూసమస్యలు పరిష్కరించి అందరికీ పట్టా పాసు పుస్తకాలు ఇవ్వడంతో పాటు రైతుబంధు, రైతుబీమాను అందించాలని సూచించినట్లు తెలిసింది.logo