మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 01:29:44

ముగ్గురు మిత్రులు మృత్యుఒడికి

ముగ్గురు మిత్రులు మృత్యుఒడికి

  • బైక్‌ను ఢీకొన్న లారీ
  • మంథనిలో రోడ్డు ప్రమాదం
  • మూడు కుటుంబాల్లో విషాదం

మంథని టౌన్‌: మరో గంట గడిస్తే కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాల్సిన యువకులను విధి వెంటాడింది. ఉన్న ఊర్లో ఉపాధి లేక.. వలస వెళ్లినా అక్కడా పని లేకపోవడంతో ఇంటిదారి పట్టిన ముగ్గురు స్నేహితులను లారీ రూపంలో మృత్యువు కబళించింది. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని కూచిరాజ్‌పల్లి గ్రామ శివారులో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన కలిచివేసింది. జూలపల్లి మండలం అబ్బాపూర్‌కు చెందిన చొప్పరి రజినీకాంత్‌(22), మిట్ట మధూకర్‌(25), బాల్‌రాజ్‌పల్లికి చెందిన ఆడప సురేశ్‌(23) ముగ్గురు మిత్రులు. ఇందులో మధూకర్‌ ఏంబీఏ, సురేశ్‌ డిగ్రీ పూర్తి చేశారు. రజినీకాంత్‌ డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాలు కావడం.. లాక్‌డౌన్‌తో పనులు లేక సతమతమవుతున్న తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో మూడు నెలల క్రితం భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం బొమ్మాపూర్‌ ఇసుక క్వారీలో పనిలో చేరారు. కొద్దిరోజులుగా క్వారీ సరిగ్గా నడవకపోవడంతో పని ఉండటం లేదు. దీంతో సోమవారం ముగ్గురు కలిసి బైక్‌పై తమ ఇం డ్లకు బయలుదేరారు. 

మంథని పట్టణ శివారులోని కూచిరాజ్‌పల్లి సమీపంలోకి రాగానే.. పెద్దపల్లి నుంచి మంథని వైపు వస్తున్న లారీ ఎదురుగా వచ్చి అతివేగంగా ఢీకొట్టింది. దీంతో చొప్పరి రజినీకాంత్‌, మిట్ట మధూకర్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, తీవ్ర గాయాలతో పడి ఉన్న సురేశ్‌ను మంథని ప్రభుత్వ దవాఖానకు తరలించి ప్రథమ చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. కాగా లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.logo