ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 01:37:33

తిరుమలలో కరోనా విశ్వరూపం

తిరుమలలో కరోనా విశ్వరూపం

  • పెద్దజీయర్‌స్వామికి పాజిటివ్‌.. చెన్నైకి తరలింపు
  • ఇప్పటివరకు 160 మంది సిబ్బంది, 16 మంది అర్చకులకు కొవిడ్‌
  • శ్రీవారి దర్శనాల కొనసాగింపుపై సమీక్షిస్తాం: టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి

తిరుమల, నమస్తే తెలంగాణ: తిరుమలలో కరోనా వైరస్‌ విశ్వరూపం చూపుతున్నది. ఇప్పటికే 160 మంది టీటీడీ సిబ్బంది, 16 మంది అర్చకులు కొవిడ్‌ బారిన పడగా.. శనివారం శ్రీవారి నిత్య కైంకర్యాలు నిర్వహించే పెద్దజీయర్‌స్వామికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంలో టీటీడీ సిబ్బందిలో భయాందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనాల కొనసాగింపుపై సమీక్ష నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. స్వామివారికి నిత్యసేవలుచేసే 50 మంది వంశపారంపర్య అర్చకుల్లో 16 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం టీటీడీ అధికారులతో బోర్డు చైర్మన్‌ సుబ్బారెడ్డి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పెద్దజీయర్‌స్వామిని మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలో దవాఖానకు తరలించాలని ఆదేశించారు. ప్రస్తుతంవారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని, భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇదిలా ఉండగా, పెద్దజీయర్‌స్వామికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన నేపథ్యంలో ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు శనివారం మరోసారి ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. శ్రీవారి ఆలయంలో పనిచేసే అర్చకులస్థానంలో వేరొకరిని తీసుకురాలేమని, శ్రీవేంకటేశ్వరస్వామికి నిత్య ఆరాధనలు ఆపితే మానవజాతికి మంచిది కాదని పేర్కొన్నారు. కొన్ని వారాలపాటు భక్తు దర్శనం ఆపాలని ఏపీ సీఎం జగన్‌, టీటీడీ బోర్డు చైర్మన్‌ సుబ్బారెడ్డికి విజ్ఞప్తి చేశారు. 



logo