శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 27, 2020 , 02:22:23

కరోనా కట్టడే కర్తవ్యం

కరోనా కట్టడే కర్తవ్యం

  • మందులు, వస్తువుల తయారీ అవసరం.. ఇండస్ట్రీకి సేవారంగంగా గుర్తింపు
  • ఫార్మా, బల్క్‌డ్రగ్‌ పరిశ్రమల ప్రతినిధులతో మంత్రి కే తారకరామారావు 

కరోనా కట్టడే మన తక్షణ కర్తవ్యం. ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లో అత్యవసరంకాని ఫార్మా ఉత్పత్తులను తగ్గించి కరోనా నియంత్రణ ఉత్పత్తుల తయారీపై దృష్టిపెట్టాలి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ పరిస్థితుల్లోనూ ఫార్మా ఇండస్ట్రీని ప్రభుత్వం అత్యవసర సేవారంగంగా గుర్తించింది. ప్రస్తుతం ప్రభుత్వానికి, ఇతర ప్రైవేటు సంస్థలకు కావాల్సిన సోడియం హైపోక్లోరైట్‌, బ్లీచింగ్‌ పౌడర్‌, శానిటైజర్ల ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలి.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా కట్టడే మన తక్షణ కర్తవ్యమని, ఇందుకు అవసరమైన మందులు, వస్తువులను తయారుచేయాలని ఫార్మా, బల్క్‌డ్రగ్‌ పరిశ్రమల ప్రతినిధులకు పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు సూచించారు. ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లో అత్యవసరంకాని ఫార్మా ఉత్పత్తులను తగ్గించి కరోనా నియంత్రణ ఉత్పత్తుల తయారీపై దృష్టిపెట్టాలని కోరారు. మంత్రి కేటీఆర్‌ గురువారం ప్రగతిభవన్‌లో రాష్ట్రంలోని ఫార్మా, బల్క్‌ డ్రగ్‌ మ్యానుఫాక్చరింగ్‌ యూనిట్ల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లోనూ ఫార్మా ఇండస్ట్రీని ప్రభుత్వం అత్యవసర సేవారంగంగా గుర్తించిందని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వానికి, ఇతర ప్రైవేటు సంస్థలకు కావాల్సిన సోడియం హైపోక్లోరైట్‌, బ్లీచింగ్‌ పౌడర్‌, శానిటైజర్ల ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని మంత్రి కోరారు. ఉత్పత్తులను ఫార్మా కంపెనీలు తమ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వానికి అందించేందుకు ముందుకురావాలని విజ్ఞప్తిచేశారు.  సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, లైఫ్‌సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తి నాగప్ప న్‌, ఫార్మా ఇండస్ట్రీ ప్రతినిధులు పాల్గొన్నారు. 

భవన నిర్మాణ కార్మికులు భద్రం

 భవన నిర్మాణ కార్మికుల బాగోగులు చూడాల్సిన బాధ్యత యజమానులదేనని మంత్రి కేటీఆర్‌ స్పష్టంచేశారు. సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించాలని కోరారు. నిర్మాణరంగ కార్మికుల సంక్షేమంపై భవన నిర్మాణదారుల సంఘాలతో మంత్రి కేటీఆర్‌ ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. కార్మికుల సంక్షేమంలో అశ్రద్ధ వహిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. యజమానులు సీఎస్సార్‌ నిధులతో ముందుకురావాలని కేటీఆర్‌ కోరారు. దీనిపై స్పం దించిన విజయ్‌ మద్దూరి (హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ సహ యజమాని) రూ.25 లక్షలు, తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ తరఫున చైర్మన్‌ లోక భూమారెడ్డి రూ.5 లక్షల చెక్కులను కేటీఆర్‌కు సీఎమ్మారెఫ్‌ కింద అందజేశారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డైరెక్టర్‌ విశ్వజిత్‌ తదితరులు పాల్గొన్నారు. 

బ్రదర్‌ అని పిలవండి..  పవన్‌కల్యాణ్‌ ట్వీట్‌పై కేటీఆర్‌


కరోనా వైరస్‌ వ్యాప్తినిరోధానికి చేస్తున్న కృషి ప్రశంసనీయమంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌.. మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్‌లో అభినందించారు. ఇందుకు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్‌ రీట్వీట్‌ చేస్తూ.. ‘థ్యాంక్స్‌ అన్న. మీరు ఎప్పట్నుంచి నన్ను సర్‌ అని పిలుస్తున్నారు.. ఎప్పుడూ బ్రదర్‌ అనే పిలవండి’ అని పేర్కొన్నారు. కరోనా వైరస్‌పై పోరాటానికి తెలుగు రాష్ర్టాలకు రూ.50 లక్షల చొప్పున విరాళమిస్తున్న పవన్‌ను కేటీఆర్‌ అభినందించారు. కరోనా వైరస్‌ ఎదుర్కొనేందుకు విరాళాలు అందజేసిన సినీనటులు మహేష్‌బాబు, రామ్‌చరణ్‌, సాయిధరమ్‌తేజ్‌ను ‘వెల్‌డన్‌ హీరోస్‌' అంటూ కేటీఆర్‌ ప్రశంసించారు. ట్విట్టర్‌ ద్వా రా విజ్ఞప్తిచేసిన వెంటనే స్పందించి స మస్యలకు పరిష్కారం చూపుతున్న కేటీఆర్‌ను పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతా క్రిష్ణన్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రశంసించారు. ‘ఇలాంటి నాయకులు ఉండటం మాకెంతో గర్వకారణం’ అని పేర్కొన్నారు. జార్ఖండ్‌ నుంచి 26 మంది విద్యార్థులను తెలంగాణకు రప్పించాలన్న విజ్ఞప్తికి స్పందించిన ఆ రాష్ట్ర సీఎం హేమంత్‌ సొరేన్‌కు కేటీఆర్‌ అభినందనలు తెలిపారు.


logo