గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 01, 2020 , 16:28:32

పరిశుభ్రతతోనే రోగాలు దూరం

పరిశుభ్రతతోనే రోగాలు దూరం

నిర్మల్‌:  'మన ఇల్లు మన వీధి మన పట్టణం' అనే భావనతో ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.  ఆదివారం నిర్మల్ పట్టణంలోని జొహ్రనగర్ ఎంసిహెచ్ ప్రసూతి ఆస్పత్రి  పక్కన గల ఖాళీ స్థలంలో  చేపట్టిన శ్రమదానం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ మన ఇల్లు మన వీధి మన పట్టణం అనే భావన కలిగి ఉండాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే రోగాలు దరిచేరవని అన్నారు. విదేశాలలో రోడ్డు మీద చెత్త  వేస్తే జరిమానా విధిస్తారని అందువల్ల అక్కడ రోడ్ల మీద ఎవరూ కూడా చెత్త వేయరని అన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో 30 రోజుల పాటు పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి ప్రతి గ్రామాన్ని పచ్చదనం పరిశుభ్రతతో కళకళలాడేలా చేశారన్నారు. 

పట్టణాలలో  కూడా  పారిశుద్ధ్యం , పచ్చదనం పెంపొందించేందుకు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు పట్ణణ ప్రగతి కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. పరిశుభ్రత ఉంటే ఎలాంటి రోగాలు దరిచేరవని ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. పట్టణ అభివృద్ధికి ప్రజల తోడ్పాటు అవసరమన్నారు. మున్సిపల్ చైర్మన్, కమిషనర్, మున్సిపల్ కార్యాలయం సిబ్బంది అటెండర్ నుంచి అధికారి స్థాయి వరకు పట్టణ ప్రగతి శ్రమదానంలో పాల్గొనడం అభినందనీయమన్నారు.  ఇదే కాన్సెప్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదానం కార్యక్రమంలో  పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

అనంతరం మంత్రి ప్రసూతి ఆస్పత్రిలోని పలు వార్డులను సందర్శించారు. ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ వార్డులో ఉన్న రోగులను కలిసి వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కాన్పుల విభాగంలో సందర్శించి బాలింతలకు కేసీఆర్ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ, మున్సిపల్ చైర్ పర్సన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏరవోతు రాజేందర్, ఎఫ్ ఎస్ సి ఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్, కౌన్సిలర్ మహమ్మద్ సలీం, జిల్లా ఆస్పత్రి డాక్టర్ సురేష్,  ప్రసూతి ఆసుపత్రి ఆర్ ఎం ఓ డాక్టర్ రజని , ఎలక్ట్రిసిటీ ఎస్ ఈ చౌహన్, మున్సిపల్ కమిషనర్ ఎన్  బాలకృష్ణ, పట్టణ ప్రగతి సూపర్ వైజర్‌   కోటేశ్వరరావు, మున్సిపల్ అధికారి ఈ సంతోష్ కుమార్, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.logo