శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 02, 2020 , 02:31:33

చకచకా ప్రగతి పనులు

చకచకా ప్రగతి పనులు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి పనులు చకచకా జరుగుతున్నాయి. గత ఏడు రోజులుగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పారిశుద్ధ్య, అభివృద్ధి పనులతో కొత్తందాన్ని సంతరించుకొంటున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు నిత్యం ప్రగతి పనులను పర్యవేక్షిస్తున్నారు. పనిచేయని అధికారులు, ప్రజాప్రతినిధులపై అక్కడికక్కడే చర్యలు తీసుకొంటున్నారు. వెంటవెంటనే సమస్యలు పరిష్కారమవుతుండటంతో స్థానికులు హర్షంవ్యక్తం చేస్తున్నారు. 


పనిచేయకుంటే పదవిపోతది: ఎర్రబెల్లి

పని చేయకుంటే కౌన్సిలర్ల పదవి పోతదని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. ఆదివారం వరంగల్‌ గ్రేటర్‌ కార్పొరేషన్‌తోపాలు వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల, నర్సంపేట మున్సిపాలిటీలో ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‌, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి పర్యటించారు. పరకాలలో 1, 2, 13, 18వ వార్డుల్లో 3 కిలోమీటర్ల మేర కాలి నడకన తిరిగారు. పరిశుభ్రత పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నర్సంపేట పట్టణ ప్రగతి కార్యక్రమానికి హాజరుకాని 1, 3, 6, 14, 15, 18, 19, 20, 22 వార్డుల కౌన్సిలర్లకు నోటీసులు ఇవ్వాలని ప్రత్యేక అధికారి శ్రీనివాసరావును మంత్రి ఆదేశించారు.  


ప్రజల్లో మార్పు రావాలి: నిరంజన్‌రెడ్డి

ప్రజల్లో ‘మన ఇల్లు, మన వీధి, మన పట్టణం’ అనే భావన వచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలోని 11, 22 వార్డుల్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజుతో మంత్రి పాల్గొన్నారు. 11వ వార్డులో పారిశుధ్య పనులను మంత్రి ప్రారంభించారు.  

అందరూ పాల్గొనాలి: అల్లోల 

పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నిర్మల్‌ జిల్లాకేంద్రంలోని జోహ్రానగర్‌, విశ్వనాథ్‌పేట్‌ కాలనీల్లో నిర్వహించిన పట్టణ ప్రగతిలో కలెక్టర్‌ ముషారఫ్‌అలీఫారూఖీతో కలిసి పాల్గొన్నారు. పరిసరాలు పరిశభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ ‘ఇల్లు మనది.. వీధి మనది. పట్టణం మనది..’ అనే భావనను కలిగి ఉండాలని అన్నారు.  


నిరంతర ప్రక్రియ: సబితాఇంద్రారెడ్డి 

పట్టణ ప్రగతి నిరంతర ప్రక్రియ అని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సాయిబాలాజీ, ఆర్‌బీఆర్‌, సీఎంఆర్‌, సీవైఆర్‌, 2, 3, 4, 25వ వార్డుల్లో మంత్రి పర్యటించారు. ప్రజలతో మాట్లాడి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రగతి పనుల పేరుతో చిరు వ్యాపారులను ఎవరు ఇబ్బంది పెట్టకూడదని సీఎంకేసీఆర్‌ ఆదేశించారని చెప్పారు.   


పట్టణాల సుందరీకరణ: మల్లారెడ్డి  

పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాల సుందరీకరణ సాధ్యమవుతుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఆదివారం నాగారం మున్సిపాలిటీ శిల్పానగర్‌ కాలనీలో కార్యాలయం భవన నిర్మాణం రూ.6 లక్షలు, 7వ వార్డులో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణానికి కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం నాగారం మున్సిపల్‌ పరిధిలోని పలు వార్డులోని భస్తీలో పాదయాత్ర చేపట్టి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  logo