శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 04, 2020 , 01:54:32

మాధవాపురం మురిసింది

మాధవాపురం మురిసింది

సాగుచేస్తున్నా భూమిపై హక్కులేదు! పాస్‌పుస్తకాలు లేవు! అర్హత ఉన్నా.. రైతుబంధు, రైతుబీమా అందవు! దశాబ్దాల అపరిష్కృత సమస్యకు భూరికార్డుల ప్రక్షాళన మార్గంచూపెట్టింది. తాసిల్దార్‌ చొరువతో 957 మంది రైతులకు ఒకేసారి పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు అందాయి. రైతుపక్షపాతి సీఎం కేసీఆర్‌ వల్లే పాస్‌పుస్తకాలు అందాయంటూ చేతులెత్తి నమస్కరించారు అన్నదాతలు. కృతజ్ఞతగా ఎమ్మెల్యే, తాసిల్దార్‌పై పూలవర్షం కురిపించారు. ఈ అరుదైన దృశ్యానికి మంగళవారం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం శివారు మాధవాపురం వేదికైంది.

  • 40 ఏండ్ల భూ సమస్యకు పరిష్కారం
  • ఒకేసారి 957 మందికి పాస్‌పుస్తకాలు
  • దారిచూపిన భూ రికార్డుల ప్రక్షాళన
  • ఎమ్మెల్యే, తాసిల్దార్‌పై పూలవర్షం
  • ఎత్తుకొని ఊరేగించిన అన్నదాతలు

మహబూబాబాద్‌ రూరల్‌:  మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం శివారు మాధవాపురంలో 2,500 ఎకరాల్లో భూములు సాగుచేసుకుంటున్న రైతులకు 40 ఏండ్లుగా పట్టదార్‌ పాస్‌పుస్తకాలు లేవు. ఎవరి భూముల్లో వారు సాగుచేసుకుంటున్నప్పటికీ రికార్డుల్లేవు. దీంతో ఎవరికీ పాస్‌పుస్తకాలు, పహాణీ, 1బీ వంటి ఎలాంటి ఆధారం లేకపోవడంతో రైతుబంధు, రైతుబీమా పొందలేకపోతున్నారు. దశాబ్దాలుగా ఎవరికి మొరపెట్టుకున్నా వీరి సమస్య పరిష్కారంకాలేదు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన భూరికార్డుల ప్రక్షాళన దారిచూపింది. తాసిల్దార్‌ రంజిత్‌కుమార్‌ ప్రత్యేకచొరువ తీసుకొని మూడునెలలపాటు భూములను సర్వేచేశారు. రైతులవద్ద భూమికి సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో వాంగ్మూలం తీసుకొన్నారు. 


చుట్టుపక్కల రైతులను విచారించి నిర్ధారించుకొన్నారు. గ్రామంలోరైతుల సమక్షంలో ఎవరికి ఎంతభూమి ఉన్నట్టు తేలిందో చదివి వినిపించారు. రైతుల వివరాలను కంప్యూటర్‌లో నమోదుచేసి పహాణీలు, 1బీలు వచ్చేలా కృషిచేశారు. రెండురోజుల కిందట 957 మంది రైతుల పాస్‌పుస్తకాలు జిల్లాకు చేరాయి. మంగళవారం వాటిని రైతులకు అందజేసేందుకు ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, తాసిల్దార్‌ రంజిత్‌కుమార్‌ గ్రామానికి వెళ్లారు. రైతులు వారికి ఎదురెళ్లి పూలవర్షం కురిపించారు. భుజాలపై ఎత్తుకొని ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం తాసిల్దార్‌ను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా 957 మంది రైతులకు పాస్‌పుస్తకాలు అందజేశారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన భూరికార్డుల ప్రక్షాళనతోనే పాస్‌పుస్తకాలు అందాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు. 


రైతులకు న్యాయం చేశా  

పట్టదార్‌ పాస్‌పుస్తకాలను రైతులకు అందించేందుకు సిబ్బందితో కలిసి నిరంతరం పనిచేశాం. భూములన్నీ సర్వేచేసి రైతుల వాంగ్మూలం తీసుకున్నాం. భూరికార్డుల ప్రక్షాళననలో భాగంగానే పాస్‌పుస్తకాలను అందించాం. ఒకేసారి ఇంతమందికి పాస్‌పుస్తకాలు అందించినందుకు సంతోషంగా ఉంది. నా జీవితంలో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుంది.

- రంజిత్‌కుమార్‌, తాసిల్దార్‌,  మహబూబాబాద్‌


సీఎం కేసీఆర్‌ వల్లే పట్టాలు  

సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో వల్లే రైతులకు పాస్‌పుస్తకాలు అందాయి. ఎన్నో ఏండ్లుగా పాస్‌పుస్తకాలు లేక ఇబ్బందులు పడ్డాం. తాసిల్దార్‌ రంజిత్‌కుమార్‌కు రుణపడి ఉంటాం.

- ఇస్లావత్‌ హర్యా, మాధవాపురం  


చాలా సంతోషం 

రైతులపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నది. సీఎం కేసీఆర్‌ చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనతోనే పాస్‌పుస్తకాలు అందాయి. చాలా సంతోషంగా ఉన్నది. 

-భూక్యా దేవ్లీ, ఇస్లావత్‌తండా  


logo