బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 17:32:48

రోగులకు చిరునవ్వుతో సేవలందించాలి

రోగులకు చిరునవ్వుతో సేవలందించాలి

సిద్దిపేట‌ : ప్రభుత్వ దవాఖానలో పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాలైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. రోగుల మానసిక ధైర్యాన్ని పెంచేలా స్టాఫ్‌ నర్సులు పనిచేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలోని ఎన్సాన్‌పల్లి ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో నూతనంగా నియామకం అయిన స్టాఫ్‌నర్సులు జీఎన్‌ఎంలకు, ప్రిన్సిపాల్‌ తమిళ ఆరస్‌, సూపరింటెండెంట్‌ చంద్రయ్యతో కలిసి మంత్రి హరీశ్‌రావు నియామకపత్రాలను అందజేశారు. 

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు సీఎం కేసీఆర్‌ ప్రజలకు అత్యవసర సేవలు అందించాలన్న ఉద్దేశంతో తాత్కాలిక, కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమించారన్నారు. ఉద్యోగాల్లో చేరిన స్టాఫ్‌  నర్సులు డాక్టర్‌కు రోగికి మధ్య సంధానకర్తగా వ్యవహరించాలన్నారు. మానవ సేవయే మాధవ సేవగా భావించి స్టాఫ్‌ నర్సులు చేసే సేవలు, విధులు తల్లిదండ్రులాంటివన్నారు. కొవిడ్‌ -19 కోసం సిద్దిపేటలో 10 పడకల దవాఖానను మంజూరు చేసుకున్నామన్నారు. అతి త్వరలోనే డయాగ్నోస్టిక్‌ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకవస్తామని మంత్రి తెలిపారు. రోగులను చిరునవ్వుతో పలుకరిస్తే వారు మానసికంగా ధైర్యాన్ని పొందుతారన్నారు. 


logo