శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 26, 2020 , 00:39:31

గ్రామ స్వరాజ్యానికి బాట

గ్రామ స్వరాజ్యానికి బాట

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగా స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధత కల్పించి గ్రామ  స్వరాజ్యానికి బాటలు వేసిన ఘనత పీవీ నరసింహారావు ప్రభుత్వానిది. 1959 బల్వంత్‌ రాయ్‌ కమిటీ మొదలుకొని పలు కమిటీలు అధ్యయనాలు చేసిన నివేదికలు ఇచ్చాయి. కానీ పీవీ ప్రభుత్వం చేపట్టిన రాజ్యాంగ సవరణ వరకు పంచాయతీ రాజ్‌ వ్యవస్థ బలంగా మారలేదు. ఈ కొత్త చట్టం వల్ల అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్య పాలనకు రాజ్యాంగబద్ధమైన హామీ లభించింది. ఈ మేరకు మొదట 1989లో ఏఐసీసీ సదస్సు తీర్మానం చేసింది. ఆ తరువాత రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం 1989లో లోక్‌సభలో 64వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టింది. దీనిని రాజ్యసభ తిరస్కరించింది. ఆ తరువాత వీపీ సింగ్‌ నేతృత్వంలోని నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం 1990లో 74వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశ పెట్టినప్పటికీ ముందడుగు పడలేదు. 1991లో పీవీ నరసింహారావు సారథ్యంలో మైనారిటీ ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశ పెట్టి ఆమోదింప చేసింది. 1993 ఏప్రిల్‌ 24వ తేదీన ఈ చట్టం అమలులోకి వచ్చింది. ఇదే రీతిలో 74వ రాజ్యాంగ సవరణ నగర స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్నది. ఈ చట్టాలు అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడంలో చరిత్రాత్మకమైనవిగా చెప్పవచ్చు. నిధులు సేకరించడం, నిర్ణయాలు తీసుకోవడం అనే రెండు అంశాల ద్వారా స్థానిక సంస్థలు క్రియాశీలంగా మారాయి. అట్టడుగు స్థాయిలో ప్రణాళికా రచన, జవాబుదారీతనం ఏర్పడుతున్నది. 

73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా ఏకరూప మూడంచెల వ్యవస్థను నెలకొల్పింది. ఈ పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం మూడోవంతుకు తగ్గకుండా మహిళలకు రిజర్వేషన్‌ లభిస్తున్నది. రాజ్యాంగ సంస్థల్లో మొదటిసారిగా ఎన్నికయ్యే ప్రజా ప్రతినిధులలో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించడం ఇదే మొదటిసారి. ఎస్సీ, ఎస్టీలకు తమ జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్‌ లభిస్తుంది. ప్రజా ప్రతినిధులలోనే కాకుండా చైర్మన్‌ పదవుల్లోనూ మహిళలకు, ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్‌ ఉంటుంది. పంచాయతీ రాజ్‌ సంస్థలకు ఐదేళ్ళకు ఒకసారి క్రమబద్ధంగా ఎన్నికలు జరపవలసి ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో, కేంద్ర పాలిత ప్రాంతంలో స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలి. జిల్లా ప్రణాళికా కమిటీకి రాజ్యాంగ బద్ధత ఉంటుంది. పంచాయతీ రాజ్‌ సంస్థలకు 29 అంశాలను బదలాయించాలి. ఈ అంశాలలో ప్రణాళికలను రచించుకొని అమలు చేయడం పంచాయతీ సంస్థల బాధ్యత. పన్నులు విధించడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలకు రుసుమును వసూలు చేసే అధికారం పంచాయతీ రాజ్‌ సంస్థలకు లభించింది. రాష్ట్ర శాసన సభల మాదిరిగానే పంచాయతీ రాజ్‌ వ్యవస్థలో గ్రామ సభలు శక్తిమంతంగా పనిచేస్తాయి. గ్రామీణులు తమ భవితవ్యాన్ని తామే నిర్దేశించుకోవడానికి ఈ పంచాయతీ వ్యవస్థ దోహదం చేస్తున్నది. 


logo