బుధవారం 03 జూన్ 2020
Telangana - May 23, 2020 , 01:02:07

నాడు తినడానికి చాలలే.. నేడు భారీగా దిగుబడులు

నాడు తినడానికి చాలలే.. నేడు భారీగా దిగుబడులు

  • ఇప్పుడు పంట నిల్వకు గోదాములు సరిపోతలేవు
  • ఆరేండ్లలోనే తెలంగాణ సాధించిన ఘనత ఇది
  • వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
  • నియంత్రిత సాగుతో మేలు: మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తేతెలంగాణ: ‘ఒకప్పుడు పండిన పంట తినడానికి సరిపోయేది కాదు.. ఇప్పుడు పంట దిగుబడులను నిల్వ చేసుకోవడానికి గోదాములు సరిపోతలేవు.. గడిచిన యాసంగిలో రాష్ట్రంలో 39.40 లక్షల ఎకరాల్లో సాగు చేసిన వరి నుంచి కోటి టన్నుల  దిగుబడి వచ్చే అవకాశమున్నది.. కాళేశ్వరం పూర్తయితే తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా మారుతుంది.. ఇది ఆరేండ్లలో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం సాధించిన ఘనత’ అని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నా రు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మార్కెట్‌ కమిటీ పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని చెప్పారు. పెద్ద ఎత్తున ధాన్యం పండటంతో మరో 40లక్షల టన్నుల సామర్థ్యమున్న గోదాములు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. కేరళ, తమిళనాడు రాష్ర్టాలు మన బియ్యంపై ఆధారపడుతున్నాయని చెప్పారు. దిగుబడి ఎక్కువైతే పంటల విక్రయానికి రైతులు ఇబ్బందులు పడుతారనే సీఎం కేసీఆర్‌ నియంత్రిత సాగుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ విధానాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష పార్టీలు.. ఇష్టం వచ్చినట్లుగా సాగు చేస్తే వచ్చే  పంట దిగుబడి కొనుగోలుకు హామీ ఇస్తాయా? అని ప్రశ్నించారు. ఆన్‌లైన్‌ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులనూ ఇంటింటికీ పంపిణీ చేసేలా మార్కెటింగ్‌శాఖలో కొత్త ఆవిష్కరణలను తీసుకొస్తామని మంత్రి చెప్పారు. అనంతరం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ.. రైతులకు లాభం చేకూర్చడానికే సీఎం కేసీఆర్‌ నియంత్రిత వ్యవసాయ విధానాన్ని తెచ్చారన్నారు. సీఎం ఆలోచన విధానాలను అన్నదాతలు ఆచరణలో చూపాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.


logo